మోదీ 30 సార్లు వచ్చారు.. ప్రతిసారి గిఫ్ట్‌లు తెచ్చారు: అమిత్‌షా

ABN , First Publish Date - 2020-12-26T22:21:56+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధికి 'గ్రోత్ ఇంజన్'గా ..

మోదీ 30 సార్లు వచ్చారు.. ప్రతిసారి గిఫ్ట్‌లు తెచ్చారు: అమిత్‌షా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధికి 'గ్రోత్ ఇంజన్'గా నిలుస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రశంసించారు. దేశాభివృద్ధిలో ఈశాన్య ప్రాంతాలు చాలా కీలకమైనవిగా మోదీ గుర్తించడంతో పాటు ప్రధానంగా ఈశాన్యంపై దృష్టిసారించారని చెప్పారు. గత ఆరేళ్లలో ఆయన 30 సార్లు ఇక్కడకు వచ్చారని, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కానుకలతో వచ్చారని తెలిపారు.


గువాహటిలో శనివారంనాడు పలు అభివృద్ధి కార్యక్రమాలను అమిత్‌షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, ఆర్థిక మంత్రి హిమాంత బిస్వా శర్మ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, శాంతి దిశగా నడకలు సాగిస్తోందని ప్రశంసించారు. అసోం ఒకప్పుడు హింస, ఆందోళనలకు మారుపేరుగా నిలిచిందన్నారు. అభివృద్ధి ఒక్కటే మనం ముందుకు వెళ్లడానికి మార్గమని ఆయన సూచించారు. అభివృద్ధి అప్రతిహతంగా సాగుతూనే ఉండాలని, సైద్ధాంతిక మార్పు అనేది కూడా అవసరమని, అభివృద్ధి లేకుండా అది సాధ్యం కాదని చెప్పారు. ఇటీవల ముగిసిన బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన విజయం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ వంటిదని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించనున్నామనడానికి సంకేతమని అమిత్‌షా పేర్కొన్నారు.


సంస్కృతి, రాష్ట్ర భాషలు పటిష్టం కానిదే దేశ గొప్పతనం ప్రస్ఫుటం కాదని బీజేపీ బలంగా నమ్ముతుందని అమిత్‌షా అన్నారు. అసోం కళలు, సంస్కృతిని ప్రస్తావించకుంటే దేశ సంస్కృతి, కళలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయన్నారు. రాష్ట్రంలోని తీవ్రవాద సంస్థలన్నీ ప్రభుత్వానికి లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై మాట్లాడుతూ, రైతులు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమిత్‌షా సూచించారు.

Updated Date - 2020-12-26T22:21:56+05:30 IST