ఉత్తర కొరియాలో కోవిడ్-జీరో మిస్టరీ?

ABN , First Publish Date - 2020-04-08T22:44:02+05:30 IST

కోవిడ్-19 కేసులు ఒక్కటి కూడా నమోదు కానీ దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు ఇదే ..

ఉత్తర కొరియాలో కోవిడ్-జీరో మిస్టరీ?

జెనీవా: కోవిడ్-19 కేసులు ఒక్కటి కూడా నమోదు కానీ దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు ఇదే విషయం చెబుతున్నాయి. ప్రపంచాన్ని అంతలా గడగలాడిస్తున్న కరోనా ఉత్తర కొరియా జోలికి మాత్రం వెళ్లలేదా? ఒకవేళ వెళ్లినా అది రికార్డుల వరకూ వెళ్లడం లేదా? ఇదంతా మిస్టరీగానే ఉందంటున్నారు నిపుణులు.


ఉత్తర కొరియాలో కోవిడ్ పరీక్షలు జరుగుతున్నా, 500 మందికి పైగా క్వారంటైన్‌లో ఉన్నా...ఇంతవరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్‌కే)లో డబ్లుహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ ఎడ్విన్ సాల్వడార్ తాజాగా 'రాయిటర్స్' వార్తా సంస్థకు తెలిపారు.


ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రతివారం కోవిడ్ తాజా సమాచారం డబ్ల్యూహెచ్‌ఓకు అందుతుంటుంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లోని నేషనల్ రిఫరెన్స్ ల్యాబరేటరీలో కరోనా వైరస్ పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తుంటారు. 'ఏప్రిల్ 2 వరకూ, 11 మంది విదేశీయులు, 698 మంది ఉత్తర కొరియా వాసులతో కలిపి మొత్తం 709 మందికి కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అయితే ఒక్క కేసు కూడా ఇంతవరకూ నమోదు కాలేదు. 509 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. వారిలో 507 మంది స్వదేశీయులు, ఇద్దరు విదేశీయులు ఉన్నారు' అని డాక్టర్ సాల్వడార్ 'రాయిటర్స్'కు ఇచ్చిన ఇ-మెయిల్ రిప్లైలో తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31 నుంచి 24,842 మందిని క్వారంటైన్ నుంచి డిశ్చార్చ్ చేయగా, ఇందులో 380 మంది విదేశీయులు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు.


గత జనవరిలో పీసీఆర్ డయోగ్నోస్టిక్ పరీక్షల కోసం అవసరమైన సహకారం చైనా అందించినట్టు ఆయన చెబుతున్నారు. వ్యాధి నిరోధక సామాగ్రిని డబ్ల్యుహెచ్ఓ అందించింది. డబ్ల్యుహెచ్ఓ వెబ్‌సైట్‌లో వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కరోనా కేసులు, 72,614 మరణాలు నమోదయ్యాయి. 206 దేశాల నుంచి ఈ గణాంకాలు నమోదు కాగా, నార్త్ కొరియా, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్‌, యెమెన్‌ వంటి దేశాల్లో మాత్రం ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.


ఆంక్షలు ఎత్తేయండి...

ఈ నేపథ్యంలో అణ్వస్త్ర, క్షిపణి కార్యక్రమాలను నిరోధించేందుకు నార్త్ కొరియాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల నిపుణుడు ఒకరు పిలుపునిచ్చారు. కరోనా విస్తరణతో ప్రపంచ దేశాల్లో ఆకలికి అలమటిస్తున్న ప్రజలకు ఆహార సామగ్రిని సరఫరా చేసేందుకు ఈ ఆంక్షల సడలింపు ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు.


ఫిబ్రవరిలోనే పరీక్షలు...

కాగా, గత ఫిబ్రవరి 9 నుంచి ఆరు వారాల పాటు సుమారు 7,300 మంది పర్యాటకులకు నార్త్ కొరియా పరీక్షలు నిర్వహించినట్టు జెనీవాలోని డబ్ల్యూహెచ్ఓ కార్యాలయం తెలిపింది. ఇందులో జ్వరంతో బాధపడుతున్న 141 మంది పర్యాటకులకు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌గా పరీక్షల్లో తేలినట్టు చెప్పింది. వీటికి తోడు, సరిహద్దు తనిఖీలను నార్త్ కొరియా కట్టుదిట్టం చేయడంతో పాటు, క్వారంటైన్ చర్యలు కూడా తప్పనిసరి చేసింది. దక్షిణ కోరియాలోని యూఎస్ బలగాల అధిపతి ఇచ్చిన సమాచారం ప్రకారం, గత మార్చి మధ్యలో ఉత్తర కొరియా తమ దేశ సైనిక దళాలకు 30 రోజుల పాటు లాక్‌డౌన్ విధించి, తిరిగి ఇటీవలే శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించింది. జనీవాలోని యూఎన్ కార్యాలయంలో నార్త్ కొరియా దౌత్యవేత్త ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 'మేము లాక్‌డౌన్‌లో ఉన్నాం. కరోనా వైరస్ విస్తరించకుండా మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడాన్ని నేను గమనించాను' అని ఆయన తెలిపారు.


కాగా, పలువురు విదేశీ నిపుణులు మాత్రం నార్త్ కొరియాలో జీరో కేసులపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చైనా, దక్షిణ కొరియాతో ఉత్తర కొరియా సరిహద్దులు పంచుకుంటోందని, చైనా, దక్షిణ కొరియాలు కరోనా కేసులతో కొట్టుమిట్టాడుతుంటే, ఉత్తర కొరియాలో మాత్రం కరోనా జాడే కనిపించడం లేదనడం విస్మయం కలిగిస్తోందని వారంటున్నారు.

Updated Date - 2020-04-08T22:44:02+05:30 IST