ఆన్‌లైన్‌లో నామినేషన్లు, అఫిడవిట్లు
ABN , First Publish Date - 2020-08-22T07:58:16+05:30 IST
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి దృష్ట్యా బిహార్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఐదుగురితో మాత్రమే ఇంటింటి ప్రచారం..
ఓటర్లకు గ్లౌజులు...
పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, సబ్బు నీళ్లు..
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి దృష్ట్యా బిహార్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబరు-నవంబరు నెలల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీతో పాటు మధ్యప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలకు ఈ గైడ్‌లైన్స్ అమలు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలన్నింటినీ ఒకరోజు ముందుగానే బాక్టీరియా-రహితంగా శానిటైజ్ చేయనున్నారు.
డిజిటల్ ప్రచారానికి మాత్రమే పరిమితమవ్వాలన్న సూచనను అనేక పార్టీలు వ్యతిరేకించడంతో- అభ్యర్థితో సహా కేవలం ఐదుగురితో మాత్రమే ఇంటింటి ప్రచారానికి అవకాశం కల్పించనున్నారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను ప్రతీ చోటా అమలు చేయనున్నారు.
దేశ చరిత్రలో తొలిసారిగా --- ఓటర్లందరికీ గ్లౌజులు సమకూర్చి ఈవీఎం మీటలను నొక్కే అవకాశం కల్పించనున్నారు. అంతేక తొలిసారిగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ నామినేషన్లను, ధరావత్తును సమర్పించే వెసులబాటు కూడా కల్పించారు.
- అభ్యర్థులు ఆన్‌లైన్లో నామినేషన్లు వేయొచ్చు.
- అఫిడవిట్‌ను కూడా ఆన్‌లైన్లోనే సమర్పించవచ్చు
- డిపాజిట్ సొమ్ము కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు లేదా ట్రెజరీలో రొక్కం చెల్లించే అవకాశమూ ఉంటుంది
- నామినేషన్ దాఖలుకు అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్ర మే వెళ్లాలి... రెండు వాహనాలకు మాత్రమే అనుమతి
- ఓట్ల లెక్కింపు జరిగేటపుడు ఒక హాల్లో ఏడు కంటే ఎక్కువ టేబుళ్లు ఉండరాదు.
- ఎక్కువ మంది కౌంటింగ్ ఏజెంట్లు అటూ ఇటూ తిరుగాడకుండా భారీ స్ర్కీన్ల ద్వారా తెలుసుకునే ఏర్పాటు చేయాలి
- పోలింగ్ కేంద్రానికొచ్చే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలి... మాస్క్‌లు లేని వారికి సిబ్బందే మాస్కులివ్వాలి.
- పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, సబ్బు నీళ్లు ఉంచాలి
- 80 ఏళ్లు పైబడ్డవారు, కొవిడ్ పాజిటివ్ రోగులు, క్వారంటైన్‌లో, చికిత్సలో ఉన్నవారు, కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు.
- కొవిడ్ రోగులు లేదా చికిత్సలో ఉన్నవారు చివరి గంటలో మాత్రమే ఓటు వేసేట్లు నిబంధనలు జారీ.