సీఎం మమతపై అమర్త్యసేన్ ప్రశంసలు!

ABN , First Publish Date - 2020-12-29T01:29:37+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రశంసల జల్లు కురిపించారు...

సీఎం మమతపై అమర్త్యసేన్ ప్రశంసలు!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం మమత తనకు ఎంతో అండగా నిలిచారంటూ ఆమెను అభినందించారు. శాంతి నికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ ఆవరణంలో కొందరు ప్రయివేటు వ్యక్తులు ‘‘చట్ట విరుద్ధంగా భూ ఆక్రమణకు’’ పాల్పడ్డారంటూ వర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘కబ్జాకు’’ పాల్పడిన వారిలో అమర్త్యసేన్ పేరు కూడా ప్రస్తావిస్తూ విశ్వభారతి ట్రస్ట్ ప్రశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయతే తన స్థలానికి సంబంధించిన లీజు గడువు ఇంకా ముగియలేదనీ.. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ‘‘కేంద్ర ప్రయోజనాలకు అనుగుణంగా’’ వ్యవహరిస్తున్నారంటూ అమర్త్యసేన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఒక సోదరిగా అమర్త్యసేన్‌కు మద్దతుగా ఉంటానని పేర్కొంటూ సీఎం మమత ఇటీవల లేఖ రాశారు. దీనిపై ఇవాళ అమర్త్యసేన్ స్పందిస్తూ.. ‘‘డియర్ మమత.. మీ లేఖ నా హృదయాన్ని కదిలించింది. అంతేకాదు.. మీరు తీరిక లేకుండా ఉన్నప్పటికీ, దాడులకు గురవుతున్న నాలాంటి ప్రజల కోసం సమయం కేటాయించగలరని రుజువైంది. మీ పదునైన స్వరం.. జరుగుతున్న విషయాల పట్ల మీకున్న అవగాహన, నాకు  ఎనలేని శక్తిని అందించింది...’’ అని పేర్కొన్నారు. తనకు మద్దతుగా లేఖ రాసినందుకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. 

Updated Date - 2020-12-29T01:29:37+05:30 IST