నడిచి వెళ్లడం, ఆకలితో ఉండటానికి వీళ్లేదు: కెప్టెన్
ABN , First Publish Date - 2020-05-25T01:34:57+05:30 IST
వలస కార్మికులెవరూ తమ సొంత రాష్ట్రాలకు కాలినడకన వెళ్లకుండా చూడాలని, పంజాబ్‌లో ఉండగా వారు ఏమాత్రం ఆకలికి గురికాకుండా ..

ఛండీగఢ్: వలస కార్మికులెవరూ తమ సొంత రాష్ట్రాలకు కాలినడకన వెళ్లకుండా చూడాలని, పంజాబ్‌లో ఉండగా వారు ఏమాత్రం ఆకలికి గురికాకుండా చూడాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లు, జిల్లా పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
రోడ్లపై వలస కార్మికులు ఎవరు కనబడినా, వారిని పోలీసులు బస్సుల్లో ఎక్కించి సమీపంలో రైళ్లు, బస్సులు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు తీసుకువెళ్లానని సీఎం ఒక అధికార ప్రకటనలో సూచించారు. ఇందువల్ల వలస కార్మికులు తమ రాష్ట్రాలకు బస్సుల్లోనో, రైళ్లలోనే వెళ్లేందుకు వీలవుతుందని చెప్పారు.
సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్క వలస కార్మికుడికి ఉచిత రవాణా, ఆహార సదుపాయాలు కల్పించే పూచీ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. నిరాశ, నిస్పృహలో ఉన్న ప్రతి కార్మికుడు రాష్ట్రానికి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పాటుపడిన వారేనని, తమ ప్రభుత్వం వారి పట్ల అదే నిబద్ధతతో ఉంటుందని అన్నారు.
'పంజాబ్ మీ జన్మభూమి కాకపోయినా ఇది మీ కర్మభూమి. మీరు కాలినడకన మీ ప్రాంతాలకు వెళ్లనవసరం లేదు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేందుకు మీకు అన్ని అవసరమైన ఏర్పాట్లు మీకు చేస్తాం' అని వలస కార్మికులకు అమరీందర్ సింగ్ భరోసా ఇచ్చారు. ఆంక్షల సడలింపులో గత 3-4 రోజుల నుంచి రాష్ట్రంలోని నాలుగింట మూడువంతుల పారిశ్రామిక యూనిట్లు తిరిగి తమ కార్యక్రమాలు ప్రారంభించినందున పంజాబ్ నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గవచ్చన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. పంజాబీలందరికీ పంజాబ్ మాతృభూమని, వారు ఎక్కడున్నా వెనక్కి రప్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని కూడా అమరీందర్ స్పష్టం చేశారు.