మాస్కులపై కొత్త నిబంధన.. 30 సెకన్లు తొలగించాల్సిందే..
ABN , First Publish Date - 2020-06-11T23:54:15+05:30 IST
దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు కొవిడ్-19 ఆంక్షలను సడలించిన నేపథ్యంలో...

భోపాల్: దాదాపు రెండు నెలల తర్వాత కొవిడ్-19 ఆంక్షలను సడలించిన నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకులు, నగల దుకాణాలకు వచ్చే వినియోగదారులకు మాస్కులు తప్పనిసరి చేస్తూనే... వారిని గుర్తించేందుకు వీలుగా 30 సెకన్లపాటు మాస్కు తొలగించే నిబంధన కూడా ప్రవేశ పెట్టింది. తద్వారా వినియోగదారులను సీసీ కెమేరాలు చిత్రీకరించేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. బ్యాంకులు, నగల దుకాణాల వద్ద భద్రత పెంచేందుకే 30 సెకన్ల పాటు మాస్కు తొలగింపు నిబంధన పెట్టినట్టు వారు వెల్లడించారు.
‘‘చోరీలకు పాల్పడిన తర్వాత దొంగలు తమ గుర్తింపు తెలియకుండా పారిపోయే అవకాశం ఉంది. మాస్కుల వల్ల సీసీకెమేరాలు ఉన్నా ఉపయోగం ఉండదు...’’ అని కైలాస్ మక్వానాకి చెందిన ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. పోలీసు అధికారులంతా తమ ప్రాంతాల్లో మంచి క్వాలిటీ కెమేరాలు వినియోగించాలని ఆయన కోరారు. తొలిదశ ‘‘అన్‌లాక్’’ సందర్భంగా సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రార్థనా స్థలాలు, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకున్నాయి.