వచ్చే వారం నుంచి ఉచిత కరోనా టెస్టులు ఉండవ్..!

ABN , First Publish Date - 2020-10-08T01:48:30+05:30 IST

వచ్చే వారం నుంచి కొవిడ్-19 పరీక్షలపై ఛార్జీలు వసూలు చేస్తామని మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్-19 టెస్టింగ్ కిట్లపై..

వచ్చే వారం నుంచి ఉచిత కరోనా టెస్టులు ఉండవ్..!

షిల్లాంగ్: వచ్చే వారం నుంచి కొవిడ్-19 పరీక్షలపై ఛార్జీలు వసూలు చేస్తామని మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్-19 టెస్టింగ్ కిట్లపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సబ్సిడీని ఉపసంహరించున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ టిన్సాంగ్ పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి ఛార్జీలు చెల్లించిన తర్వాతే కొవిడ్-19 శాంపిళ్లు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కరోనా కేర్ సెంటర్లలో సైతం భోజనాలపై ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉన్న వారు పెయిడ్ ఐసోలేషన్‌లో ఉండేందుకు అంగీకరిస్తే.. వారిని తరలించేందుకు వివిధ హోటళ్లు, అతిథి గృహాల వివరాలను సేకరించే ప్రక్రియ కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.


‘‘అక్టోబర్ 16 నుంచి డబ్బులు చెల్లిస్తేనే పరీక్షలు చేస్తాం. అది ఆర్టీ-పీసీఆర్ కావచ్చు, సీబీఎన్ఏఏటీ, ట్రూనాట్ లేదా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కావచ్చు .. కొవిడ్-19 పరీక్షలన్నిటికీ ఇది వర్తిస్తుంది. అయితే దారిద్రరేఖకు దిగువన ఉన్నవారు (బీపీఎల్), జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) లబ్ధిదారులు, కరోనా ముప్పు అత్యధికంగా ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది...’’ అని డిప్యూటీ సీఎం వివరించారు. సందర్శకులు సహా అందరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు తప్పనిసరి చేస్తున్నామని అందుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే బీపీఎల్ కేటగిరీ కింద ఉన్నవారికి, 72 గంటల్లోపు టెస్టులు చేయించుకున్న సందర్శకులకు మినహాయింపు ఉంటుందన్నారు. ట్రూనాట్, సీబీఎన్ఏఏటీ, ఆర్టీ పీసీఆర్ టెస్టింగ్‌లకు గరిష్టంగా రూ. 3,200 వరకు ధరలు నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వారు ముందుగానే కరోనా టెస్టులకు రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా కరోనామేగ్.ఇన్ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. 

Updated Date - 2020-10-08T01:48:30+05:30 IST