హత్రాస్‌కు బయల్దేరుతున్నాం... ఏ శక్తీ అడ్డుకోలేదు : రాహుల్
ABN , First Publish Date - 2020-10-03T19:14:31+05:30 IST
హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ బృందం బయల్దేరుతుందని, ఏ శక్తీ

న్యూఢిల్లీ : హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ బృందం బయల్దేరుతుందని, ఏ శక్తీ తమను ఆపలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హత్రాస్‌కు బయల్దేరే ముందు రాహుల్ ఈ ట్వీట్ చేశారు. ‘‘బాధిత కుటుంబాన్నిపరామర్శించడానికి హత్రాస్‌కు బయల్దేరుతున్నాం. వారి బాధను పంచుకుంటాం. తమను ఏ శక్తీ ఆపలేదు.’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. హత్రాస్ బాధిత కుటుంబం విషయంలో యోగి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తాము తట్టుకోలేకపోతున్నామని, నిజమైన భారతీయులెవరూ కూడా తట్టుకోలేరని మండిపడ్డారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. యోగి ప్రభుత్వం నైతికంగా అవినీతిమయమైపోయిందని ధ్వజమెత్తారు. బాధితురాలికి సరైన వైద్యం కూడా అందలేదని, ఆమె మృతదేహాన్ని బలవంతంగా తగలబెట్టారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని బందీ చేశారని, నార్కో పరీక్షలు నిర్వహిస్తామని బెదిరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. బాధిత కుటుంబంపై పోలీసులు, ప్రభుత్వ తీరు ఏమాత్రం సరియైనది కాదని ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు.
టోల్ గేట్‌ను మూసేసిన పోలీసులు
హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ బయల్దేరుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని ఢిల్లీ ప్లాజా వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాకుండా ప్లాజాను పూర్తిగా మూసేశారు.