గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు: రాజ్‌నాథ్ సింగ్
ABN , First Publish Date - 2020-09-18T08:39:02+05:30 IST
లద్దాఖ్ సరిహద్దుల్లో భారత దళాల గస్తీని ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదని కేంద్రం చైనాకు స్పష్టం చేసింది...

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: లద్దాఖ్ సరిహద్దుల్లో భారత దళాల గస్తీని ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదని కేంద్రం చైనాకు స్పష్టం చేసింది. ఒప్పందాలకు కట్టుబడి వెనక్కి మళ్లాల్సిందేనని పీఎల్‌ఏ దళాలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తేల్చిచెప్పారు. రాజ్యసభలో గురువారంనాడు సరిహద్దు ఘర్షణలపై జరిగిన చర్చకు ఆయన బదులిచ్చారు. ‘గల్వాన్ లోయలో అనేక చోట్ల చైనా దురాక్రమణకు పాల్పడినట్లు వార్తాకథనాలు వచ్చాయి. నిజంగా మన దళాలు గస్తీ నిర్వహించలేని పరిస్థితి ఉందా..?’ అని రక్షణశాఖ మాజీ మంత్రి ఏకే అంటోనీ ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన రాజ్‌నాథ్- ‘గస్తీ అనేది కొన్ని పద్ధతుల మీద, సంప్రదాయాల మీద జరుగుతుంది. దీన్ని ఏనాడో నిర్వచించడం కూడా జరిగింది. దాని ప్రకారమే మన దళాలు పహరా సాగిస్తున్నాయి. భూమ్మీద ఏ శక్తీ మన పెట్రోలింగ్‌ను అడ్డుకోలేదు. పీఎల్‌ఏ దళాల మోహరింపును ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ గమనిస్తున్నాం. మే నెలలో చైనా ముందుకు చొచ్చుకొచ్చింది. జూన్ 15న గల్వాన్ లోయ వద్ద మన పెట్రోలింగ్‌ను అడ్డుకొంది. అదే తీవ్ర ఘర్షణకు దారితీసింది. కల్నల్ సంతో్‌షబాబు నేతృత్వంలో మన సైనికదళం వీరోచితంగా పోరాడింది. దేశ సరిహద్దులు కాపాడడంలో అత్యున్నత త్యాగనిరతి ప్రదర్శించింది. మాస్కోలో జరిపిన చర్చల్లో నేను, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్- చైనాకు మూడే మూడు విషయాలు స్పష్టం చేశాం. వాస్తవాధీన రేఖను గౌరవించాలి- యథాతథస్థితిని మార్చరాదు, గత ఒప్పందాలన్నింటికీ కట్టుబడాలి, సేనలను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించి కనీస దూరాన్ని పాటించాలి... అని! సరిహద్దుల వెంబడి శాంతి నెలకొనడానికి ఇరుపక్షాలూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చైనా బదులిచ్చింది. కానీ వారి మాటలకు, చేతలకు పొంతన లేదు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కవ్వింపులకు పాల్పడుతోంది’’ అని రాజ్‌నాథ్ వివరించారు.
దేశమంతా ఆర్మీ వెన్నంటే: విపక్షం
చైనాతో ఘర్షణల విషయంలో అన్ని పక్షాలూ సైన్యానికి సంఘీభావం ప్రకటించాయి. సైనిక దళాలకు పూర్తి మద్దతునిస్తున్నామని పార్టీలకతీతంగా సభ్యులందరూ పేర్కొన్నారు. కశ్మీర్ పౌరుడిగా భారత దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నానని, చైనా విషయంలో తనదీ అదే వైఖరని కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. చైనా ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని వెంటనే స్వాధీనపర్చుకోవాలని పలు పార్టీల సభ్యులు కోరారు. ఏజీపీ, టీఆర్‌ఎస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, సీపీఎం, సీపీఐ సభ్యులు మద్దతు ప్రకటించారు.