కోవిడ్-19: కేంద్రం మరో సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-03-24T00:10:57+05:30 IST

కోవిడ్-19 పాజిటివ్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది...

కోవిడ్-19: కేంద్రం మరో సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: కోవిడ్-19 పాజిటివ్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి దేశీయ విమాన సర్వీసులన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి 11:59 లోపే విమానాలన్నీ తమ గమ్యస్థానానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. అయితే కార్గో విమానాలను మాత్రం యధాతథంగా అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. తొలుత నేటి అర్థరాత్రి నుంచే దేశీయ విమానాలను నిలిపివేస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ... ఈ నిర్ణయం రేపటి నుంచి అమలు కానుందని అధికారులు తెలిపారు.


 కాగా ఇప్పటికే వారం రోజుల పాటు అంతర్జాతీయ విమానాలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పలు దేశాలతో సరిహద్దులను కూడా ప్రభుత్వం మూసివేసింది. రాష్ట్రాల మధ్య ప్రజల కదలికలను నిలిపివేసేందుకు అంతర్రాష్ట్ర బస్సులు, మెట్రోలు, రైళ్లను కూడా నిలిపివేశారు. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇవాళ 415కు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో ప్రజా రవాణా నిలిపివేత, లాక్‌డౌన్ వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేమంటూ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-03-24T00:10:57+05:30 IST