ప్రణబ్ పుస్తకంపై ఇప్పుడే మాట్లాడడం తగదు: కేంద్ర మాజీ మంత్రి
ABN , First Publish Date - 2020-12-14T01:17:37+05:30 IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’పై స్పందించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి

బెంగళూరు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’పై స్పందించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ నిరాకరించారు. ఆ పుస్తకంపై వ్యాఖ్యానించడం తొందరపాటు చర్యే అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ తదితరులపై పుస్తకంలో ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అప్పటి మన్మోహన్‌సింగ్ సారథ్యంలోని ప్రభుత్వంలో వీరప్పమొయిలీ కీలకంగా వ్యవహరించారు. పుస్తకం ఇంకా విడుదల కావాల్సి ఉందని, ఆయన ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా తాను స్పందించాలనుకోవడం లేదని మొయిలీ తేల్చి చెప్పారు.
ప్రణబ్ ఆత్మకథ ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రూపా పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఐదేళ్లపాటు కాంగ్రెస్‌కు సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్‌పై చేసిన సునిశిత విమర్శలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. 2004లో ప్రణబ్ కనుక ప్రధాని అయి ఉంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పి ఉండేదని కొందరు పార్టీ నేతలు తన వద్ద వ్యాఖ్యానించినట్టు ‘దాదా’ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు.
తాను రాష్ట్రపతి అయిన తర్వాత పార్టీ దృక్కోణం మారినట్టు అనిపించిందని ప్రణబ్ ఆ పుస్తకంలో అభిప్రాయపడ్డారు. పార్టీ వ్యవహారాలను సోనియా సరిగా చక్కదిద్దలేకపోతున్నారని, పార్టీ ఎంపీలకు, ప్రధాని మన్మోహన్‌కు మధ్య ఎడం పెరిగిందని ప్రణబ్ పేర్కొన్నట్టుగా ఉన్న పేజీలను రూపా పబ్లిషర్స్ విడుదల చేసింది. బెంగాల్‌లోని ఓ కుగ్రామం నుంచి వచ్చిన ప్రణబ్ దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్ వరకు సాగిన ప్రస్థానాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో పేర్కొన్నట్టు రూపా పబ్లిషర్స్ పేర్కొంది.
కాగా, ప్రణబ్ పుస్తకంపై స్పందించేందుకు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా నిరాకరించారు. ఇలాంటి విషయాలపై స్పందించే ముందు ఆ వ్యాఖ్యలకు దారితీసిన సందర్భం ఏమిటనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుందని, కాబట్టి పుస్తకాన్ని చదవకుండా స్పందించడం సరికాదని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.