జేఈఈ సిలబస్‌లో మార్పులేదు

ABN , First Publish Date - 2020-12-27T09:17:10+05:30 IST

జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్‌ 2021పై పరీక్ష నిర్వహణ

జేఈఈ సిలబస్‌లో మార్పులేదు

నాలుగింటిలో ఎన్నైనా రాయొచ్చు

ఎక్కువ మార్కులే పరిగణనలోకి: ఎన్టీఏ


న్యూఢిల్లీ, డిసెంబరు 26: జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్‌ 2021పై పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) స్పష్టతనిచ్చింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి జేఈఈ మెయిన్‌ను నాలుగుసార్లు(ఫిబ్రవరి/మార్చి/ఏప్రిల్‌/మే)నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 


ప్రయోజనాలు: విద్యార్థులు 4 విడతల్లో ఎన్నింటికైనా హాజరు కావచ్చు. మొదటి ప్రయత్నంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని తదుపరి పరీక్షలో స్కోరును మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ విద్యాసంవత్సరం కోల్పోయే ప్రమాదమూ తప్పుతుంది. ఒక విద్యార్థి నాలుగు విడతల పరీక్షలను తప్పనిసరిగా రాయాల్సిన అవసరం లేదు. నాలుగింటిలో ఎన్నైనా రాసుకునే స్వేచ్ఛ విద్యార్థికి ఉంటుంది.


దేనిలో ఎక్కువ మార్కులు వస్తే దానినే స్కోరుగా పరిగణించి ఎన్టీఏ ర్యాంకును కేటాయిస్తుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు  చేసుకోవచ్చు. ఆ మేరకు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అయితే అన్ని పరీక్షలకు హాజరు కావాలనుకునే వారు ఒకే దరఖాస్తు ఫారాన్ని నింపాలి. నాలుగు పరీక్షలకూ కలిపి ఫిబ్రవరి సెషన్‌లోనే దరఖాస్తును సమర్పించవచ్చు. ఒక వేళ విద్యార్థి ఇప్పుడు కొన్ని విడతలకు దరఖాస్తును నింపి, మిగతా విడతల వివరాలను వాటి షెడ్యూల్‌    మొదలైన తర్వాత కూడా పూరించవచ్చు. అయితే మొదట సమర్పించిన దరఖాస్తు ఫారమే ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది, అందులోనే మిగతా ప్రక్రియను పూర్తిచేయాలి. విద్యార్థి దరఖాస్తు సమయంలోనే తాను హాజరు కాబోయే పరీక్షల సంఖ్యను స్పష్టంగా పేర్కొని ఆ మేరకు ఫీజును చెల్లించాలి.  ఫిబ్రవరిలో మిస్‌ అయినా మిగతా పరీక్షలను రాయవచ్చు.  సిలబ్‌సలో మార్పులు చేయలేదు. ప్రశ్నప్రతంలో స్వల్ప మార్పులు చేసింది. ఆప్షన్ల సంఖ్యను పెంచింది. మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. అందులో 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.  సెక్షన్‌ బిలోని 15 ఐచ్ఛిక ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కులు ఉండవు.


జేఈఈ మెయిన్‌ ఫిబ్రవరి షెడ్యూల్‌

దరఖాస్తుకు గడువు తేదీ: 2021 జనవరి 16

ఫీజు చెల్లింపునకు గడువు: 2021 జనవరి 17

పరీక్ష తేదీలు: 2021 ఫిబ్రవరి 23, 24, 25, 26

వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in 

Updated Date - 2020-12-27T09:17:10+05:30 IST