విమానాల్లో నో క్యాబిన్‌ బ్యాగేజ్‌!

ABN , First Publish Date - 2020-05-13T08:08:22+05:30 IST

దేశంలో లాక్‌డౌన్‌ ముగిసి న తర్వాత విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! కొవిడ్‌-19కి సంబంధించి సమగ్ర ప్రశ్నావళికి సమాధానాలివ్వాలి...

విమానాల్లో నో క్యాబిన్‌ బ్యాగేజ్‌!

  • ఆరోగ్యసేతులో గ్రీన్‌ స్టేటస్‌ ఉండాల్సిందే!
  • పౌర విమానయాన శాఖ ముసాయిదా

ముంబై, మే 12: దేశంలో లాక్‌డౌన్‌ ముగిసి న తర్వాత విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! కొవిడ్‌-19కి సంబంధించి సమగ్ర ప్రశ్నావళికి సమాధానాలివ్వాలి. క్యాబిన్‌ బ్యాగేజీ తీసుకెళ్లడానికి వీల్లేదు. మీ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణానికి కనీసం 2 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమైతే ఇలాంటి నిబంధనలన్నీ పాటించాల్సిందే. దేశంలో విమానయాన సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకుగాను స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ)తో పౌర విమానయాన శాఖ ఈ మేరకు ముసాయిదాను సిద్ధం చేసింది.


దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించేవారికి ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్‌ స్టేటస్‌ ఉండాలి. వెబ్‌ చెకిన్‌ కావాలి. అలాగే శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రయాణికులతో పాటు పైలట్లు, విమాన సిబ్బందికి కూడా నిబంధనలు వర్తింపజేయనున్నారు. భద్రతా సిబ్బంది, విమానాశ్రయ నిర్వహణ సిబ్బందికి వర్తిస్తాయని, విమానాశ్రయాల్లో భౌతిక దూరం నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ముసాయిదాలో నిర్ణయించారు. అలాగే విమానంలో మూడు వరుసలు ఖాళీగా ఉంచాలని, మెడికల్‌ ఎమర్జెన్సీ కింద ఎవరినైనా ఐసోలేట్‌ చేయాల్సి వస్తే వాటిని వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. అయితే భౌతిక దూరానికి సంబంధించి మధ్య సీటును ఖాళీగా ఉంచాలన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. 


Updated Date - 2020-05-13T08:08:22+05:30 IST