నితీశ్ నిలిచేనా
ABN , First Publish Date - 2020-10-28T06:59:56+05:30 IST
బిహార్ తొలిదశ పోలింగ్ బుధవారం జరగనుంది. సర్వేలన్నీ బీజేపీ-జేడీయూ కూటమి కే ఆధిక్యత కట్టబెట్టాయి. అయితే అవే ఒపీనియన్ పోల్స్ సీఎం నితీశ్ కుమార్ ప్రజాదరణ భారీగా తగ్గిందని, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పాపులారిటీ పెంచుకున్నారని వెల్లడించాయి...

- ఎన్‌డీఏకు నల్లేరుపై నడక కాదు
- తేజస్వీ సభలకు భారీగా జనం
- 10 లక్షల ఉద్యోగాలకు యువత ఫిదా
- ప్రజాదరణలో పుంజుకున్న ఆర్జేడీ నేత
- విజేతలను నిర్ణయించనున్న కులం..!
- నేడే బిహార్ తొలిదశ పోలింగ్!
- 71 నియోజకవర్గాల్లో ఓటింగ్
పట్నా, అక్టోబరు 27: బిహార్ తొలిదశ పోలింగ్ బుధవారం జరగనుంది. సర్వేలన్నీ బీజేపీ-జేడీయూ కూటమి కే ఆధిక్యత కట్టబెట్టాయి. అయితే అవే ఒపీనియన్ పోల్స్ సీఎం నితీశ్ కుమార్ ప్రజాదరణ భారీగా తగ్గిందని, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పాపులారిటీ పెంచుకున్నారని వెల్లడించాయి.నితీశ్‌కు 31శాతం, తేజస్వీకి 27శాతం ప్రజాదరణ ఉన్నట్లు లోక్‌నీతి-సీఎ్‌సడీసీ సర్వే పేర్కొంది. తేజస్వీ సభలకు ప్రజలు పోటెత్తడం, ఆయన హామీలకు వస్తున్న సానుకూల స్పందన జేడీయూ శ్రేణుల్లో కలవరం రేపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తేజస్వీ చేసిన 10 లక్షల ఉద్యోగాల హామీ యువతలో కొత్త ఆశలు నింపింది. తొలి సంతకం ఆ ఫైల్‌పైనేనన్న ఆయన ప్రకటన యువతలో విశ్వా సం కలిగించింది. మరోవైపు బీజేపీ.. జేడీయూకు మద్దతు ప్రకటిస్తూనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నితీశ్‌కు ప్రజాదరణ తగ్గడాన్ని గ్రహించి తన ఓటుబ్యాంకు, అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడుతోంది. పోస్టర్లపై ప్రధాని మోదీ ఫొటో తప్ప నితీశ్ ఫొటో ముద్రించలేదు. దీంతో ఈ ఎన్నికలు నితీశ్ పాలనకు రెఫరెండంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 15 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన నితీశ్‌కు ‘సుశాసన్ బాబు’ అని పేరు. లాలూప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీదేవి పాలించిన 15 ఏళ్ల కంటే నితీశ్ పాలనలోనే ఎక్కువ అభివృద్ధి సాగిందన్నది జేడీయూ మద్దతుదారుల మాట.
చిరాగ్ పాస్వాన్ సైంధవ పాత్ర
జేడీయూకు ఎల్‌జేపీ తలనొప్పిగా మారింది. బీజేపీకి దూరం కాబోనని ప్రకటించి, జేడీయూ పోటీచేస్తున్న స్థానాల్లోనే తన అభ్యర్థులను దింపి అధికార కూటమిలో చిచ్చు రేపారాయ న. మరోవైపు ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పాపులారిటీ 21ు పెరిగినట్లు సర్వేలు వెల్లడించాయి. పార్టీని నడుపుతున్న ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ‘విశ్వాసం-మార్పు’ అంటూ అన్ని వర్గాలనూ.. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నారు. ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్పీల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, ఓట్ల చీలిక జరగొచ్చన్న అంచనాలతో జేడీయూ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో 23ు ఓట్ల తేడా ఉందని, ఇప్పుడు విపక్షానికి 6-8ు ఓట్లు పెరుగుతాయని నితీశ్ అంచనా వేస్తున్నారు.
కుల సమీకరణాలే బిహార్ ఎన్నికల్లో కీలకమన్న విషయం తెలిసిందే. బలమైన యాదవ-ముస్లిం మద్దతు ఆర్జేడీకి ఉంది. తమ రెండు వర్గాలకూ చెందని నితీశ్‌ను ఇక సాగనంపాలన్న భావన వారిలో ఉంది. ఎన్డీయే నుంచి ఎల్జేపీ వెళ్లిపోవడం, దళిత ఓటు బ్యాంకు ఉన్న వామపక్షం సీఎంఐ(ఎంఎల్) తమతో ఉండటంతో విజయంపై తేజస్వి నమ్మకంతో ఉన్నారు. నితీశ్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది అత్యంత వెనుకబడిన వర్గాలు (ఈబీసీలు), మహాదళితులు. వీరిలో ఎంతమంది ఆయనకు వ్యతిరేకంగా మారతారన్నది పరిశీలించాల్సి ఉంది. అంతేకాక రాష్ట్ర ఓటర్లలో 15ు దాకా ఉన్న అగ్రవర్ణాలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తారన్న అంచనాలున్నప్పటికీ, వీరిలో ఎంతమంది జేడీయూకు ఓటేస్తారో తెలియదు. బరిలో ఉన్న మరికొన్ని పార్టీల్లో మూడో కూటమి గా చెప్పుకున్న ఆర్‌ఎల్‌ఎ్‌సపీ- బీఎస్పీ-ఎంఐఎం ఒకటి. ముఖ్యంగా ఉపేంద్ర కుశవహా నేతృత్వంలోని ఆర్‌ఎల్‌ఎస్పీ.. జేడీయూ ఓట్లను చీల్చే అవకాశాలున్నట్లు అంచనా. ఎల్జేపీ జేడీయూ ఓట్లను చీలుస్తుందని సర్వేలు చెబతున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే ఎన్నికల్లోనూ, అనంతరం కూడా నితీశ్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.