బిహార్‌ సీఎంగా 16న నితీశ్‌ ప్రమాణం?

ABN , First Publish Date - 2020-11-13T08:47:33+05:30 IST

బిహార్‌ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఈ నెల 16వ తేదీన పదవీప్రమాణం చేయనున్నట్లు తెలిసింది. తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాకున్నా.. ముఖ్యమంత్రి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థి ఆయనేనని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పిన...

బిహార్‌ సీఎంగా 16న నితీశ్‌ ప్రమాణం?

  • ఎన్‌డీఏ పక్ష నేత ఆయనేనని తేల్చేసిన మోదీ, షా
  • నేడు మిత్రపక్షాల భేటీ: సీఎం

పట్నా, నవంబరు 12: బిహార్‌ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఈ నెల 16వ తేదీన పదవీప్రమాణం చేయనున్నట్లు తెలిసింది. తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాకున్నా.. ముఖ్యమంత్రి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థి ఆయనేనని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడం రివాజు. నితీశ్‌ ఇంకా ఆ పనిచేయలేదు. ఎన్‌డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరిగి.. వారు ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్న తర్వాతే.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారని అంటున్నారు. ఎన్‌డీఏ శాసనసభాపక్ష సమావేశం ఎప్పుడు జరిగేదీ సమాచారం లేదు. నితీశ్‌ 16వ తేదీని మంచి రోజుగా భావిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆ రోజున ‘భయ్యా దూజ్‌’ (తెలుగు రాష్ట్రాల్లో ‘భగినీ (సోదరి) హస్తభోజనం’గా జరుపుతారు) పర్వదినం. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ తరపున కొత్తగా ఎన్నికైన 43 మంది ఎమ్మెల్యేలతో గురువారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. బిహార్‌ ఎన్‌డీఏలోని నాలుగు మిత్రపక్షాల నేతలం శుక్రవారం భేటీ అవుతామని, ప్రమాణ స్వీకార తేదీపై చర్చిస్తామని తెలిపారు.


‘ప్రస్తుత శాసనసభ గడువు ఈ నెల 29 వరకు ఉంది. దానికి ముందే ప్రమాణ స్వీకారం చేయాలంటే అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. మళ్లీ సీఎంగా ప్రమాణం చేయాలంటే నేను తొలుత రాజీనామా చేయాల్సి ఉంటుంది’ అని చెప్పారు. ఎన్నికల్లో జేడీయూను దెబ్బతీసిన ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ను కూటమిలో ఉంచుకునేదీ లేనిదీ బీజేపీ నిర్ణయించాలని, ఈ విషయంలో తాను చెప్పేదేమీ లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) హెచ్‌.శ్రీనివాస్‌ గవర్నర్‌ ఫగు చౌహాన్‌కు గురువారం రాజ్‌భవన్‌లో అందజేశారు.


Updated Date - 2020-11-13T08:47:33+05:30 IST