నితీష్‌కు పాశ్వాన్ ప్రత్యామ్నాయం కాదు: జేడీయూ

ABN , First Publish Date - 2020-06-06T20:31:32+05:30 IST

లోక్‌ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్‌పై జేడీయూ రాజ్యసభ ఎంపీ హరివంశ్ పరోక్షంగా విమర్శల దాడి ..

నితీష్‌కు పాశ్వాన్ ప్రత్యామ్నాయం కాదు: జేడీయూ

పాట్న: లోక్‌ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్‌పై జేడీయూ రాజ్యసభ ఎంపీ హరివంశ్ పరోక్షంగా విమర్శల దాడి చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ అత్యంత జనాదరణ కలిగిన నేత అని, రాష్ట్రంలోని ఏ పార్టీలోనూ ఆయనకు ప్రత్యామ్నాయం లేరని అన్నారు.


ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లినా, ఇంకెవరి నాయకత్వంలో వెళ్లినా తాను మాత్రం బీజేపీకే మద్దతు ఇస్తానని రామ్ విలాస్ పాశ్వాస్ శుక్రవారంనాడు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను హరివంశ్ తిప్పికొడుతూ, నితీష్ కుమార్ రాష్ట్రానికి విజనరీ లీడర్ అని, అత్యంత జనాకర్షణ కలిగిన నేత అని అన్నారు. బీహార్‌లోని ఏ పార్టీలో కూడా ఆయనకు సాటి మరొకరు లేనే లేరని అన్నారు. రాష్ట్రానికి నితీష్ కుమార్ ఎంతో చేసారని, శాంతిభద్రతలను పాదుకొలిపారని అన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రంగా బీహార్‌ను నితీష్ తీర్చిదిద్దుతున్నారని హరివంశ్ చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చేందుకు నితీష్ ఎంతో చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. పేరు కోసం వెంపర్లాడే రాజకీయాలు ఆయన ఎప్పుడూ చేయలేదని, ఎన్డీయేకు చెందిన కొందరు నేతలకు ఇది అర్ధం కాదని ఎద్దేవా చేశారు.


వలక కార్మికుల సంక్షోభ పరిష్కారం విషయంలో నితీష్ కుమార్ వ్యవహరిస్తున్న తీర్పుపై రామ్‌విలాస్ పాశ్వాన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత సమర్ధవంతంగా పని చేసి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారంనాడు బీహార్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్చువల్ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న జేడీయూ నుంచి తాజా వ్యాఖ్యలు వెలువడటం ఆ పార్టీల ఐక్యతపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. 

Updated Date - 2020-06-06T20:31:32+05:30 IST