సీఎం నితీష్ రాజీనామా
ABN , First Publish Date - 2020-11-14T01:26:09+05:30 IST
బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ..
పాట్నా: బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారంనాడు తన రాజీనామాను గవర్నర్ ఫాగు చౌహాన్‌కు సమర్పించారు. అధికారికంగా నితీష్‌ను తమ నేతగా (సీఎంగా) ఎన్డీయే మరో రెండ్రోజుల్లో ప్రకటించనుంది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 29వ తేదీతో ముగియనుంది.
ఈనెల 15న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సంయుక్త సమావేశం జరిపి, ముఖ్యమంత్రి పదవిపై ఏకాభిప్రాయం కుదరగానే ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్‌ను కలిసి తెలియజేస్తారు. ఈ విషయమై శుక్రవారంనాడు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన జేడీయూ, బీజేపీ, హెచ్ఎం, వికాశీల్ ఇన్సాన్ పార్టీలు సమావేశమయ్యారు. ఆదివారం జరిగే సంయుక్త సమావేశంలో ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా నితీష్‌ను ఎన్నుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఈ లాంఛనాలన్నీ పూర్తికావాల్సి ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ 31 సీట్ల ఆధిక్యం సాధించి, మొత్తం 74 సీట్లు గెలుచుకుంది. అయినప్పటికీ నితీష్ కుమార్‌కే పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం స్థిరనిశ్చయంతో ఉంది. నితీన్‌ను ఎన్నికల ముందే ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది..
డిప్యూటీ సీఎంగా...
ఉప ముఖ్యమంత్రిగా ఈబీసీ నేతను కానీ, దళిత నేతను కానీ బీజేపీ ముందుకు తెచ్చే అవకాశాలున్నాయనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఇందుకోసం సుశీల్ కుమార్ మోదీని మారుస్తారా, మరో డిప్యూటీ సీఎం పదవిని ఏర్పాటు చేస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు