ఇంటర్, డిగ్రీ పాస్ అయితే బాలికలకు భారీ నజరానా : నితీశ్ కుమార్
ABN , First Publish Date - 2020-10-15T01:45:27+05:30 IST
శాసన సభ ఎన్నికల వేళ బిహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకర్షణీయమైన తాయిలాలను ప్రకటించారు. బిహార్ ప్రజలంతా తన

పాట్నా : శాసన సభ ఎన్నికల వేళ బిహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకర్షణీయమైన తాయిలాలను ప్రకటించారు. బిహార్ ప్రజలంతా తన కుటుంబమేనని, తాను వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నానని చెప్పారు. తాను రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు.
మొకమలో జరిగిన జేడీయూ ఎన్నికల ప్రచార సభలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బాలికలు విద్యావంతులు కావాలన్నారు. బాలికలను ప్రోత్సహించేందుకు ఓ పథకాన్ని అమలు చేస్తామని, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన బాలికలకు రూ.25,000 చొప్పున, డిగ్రీ ఉత్తీర్ణులైన యువతులకు రూ.50,000 చొప్పున అందజేస్తామని చెప్పారు.
పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతం పదవులను, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు కేటాయించామని చెప్పారు.
నితీశ్ కుమార్ బుధవారం నాలుగు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. బంకా, భాగల్పూరు, ముంగేర్, మొకామలలో జరిగిన సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, కార్యక్రమాలను వివరించారు. జేడీయూ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.