రాష్ట్రాల సరిహద్దుల్లో అడ్డంకులు తొలగించాలి : నితిన్ గడ్కరీ
ABN , First Publish Date - 2020-04-28T23:53:46+05:30 IST
అత్యవసర సరుకులు, నిత్యావసర వస్తువులు సజావుగా రవాణా అయ్యే విధంగా

న్యూఢిల్లీ : అత్యవసర సరుకులు, నిత్యావసర వస్తువులు సజావుగా రవాణా అయ్యే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రాల సరిహద్దుల్లోని రోడ్లపై అడ్డంకులను త్వరగా తొలగించాలని తెలిపింది.
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడారు. అంతర్రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య రవాణా సజావుగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు అత్యవసరంగా చేయాలని కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు అత్యవసర, నిత్యావసర వస్తువుల రవాణా సజావుగా జరిగేలా సహకరించాలన్నారు.
కోవిడ్-19 మహమ్మారిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం నేపథ్యంలో ప్రజల జీవితాలు సజావుగా సాగడం కోసం ట్రక్కులు, లారీలు నడవడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
లారీలు, ట్రక్కుల్లో రవాణా చేసేటపుడు వాటి సిబ్బంది ఆరోగ్య సూత్రాలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖానికి మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటం, ఒకరికొకరు దూరంగా ఉండటం, దాబాల్లో కూడా ఈ నిబంధనలు పాటించేలా చూడటం చాలా ముఖ్యమని తెలిపారు.
కర్మాగారాలకు కార్మికులను రవాణా చేసేటపుడు కూడా ఆరోగ్య సూత్రాలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా చూడాలన్నారు. ఈ సూత్రాలను పాటిస్తూ, కూలీలు, కార్మికులకు ఆశ్రయం, ఆహారం అందించాలని తెలిపారు.