ఢిల్లీ కోర్టు తీర్పు: నిర్భయ తల్లి కంటతడి
ABN , First Publish Date - 2020-03-03T00:00:39+05:30 IST
నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ కోర్టు మరోసారి స్టే విధించడంపై బాధితురాలి తల్లి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు....

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ కోర్టు మరోసారి స్టే విధించడంపై బాధితురాలి తల్లి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పదే పదే వాయిదా పడడం మన ‘‘వ్యవస్థ వైఫల్య’’మంటూ ఆమె కంటతడి పెట్టారు. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు ఆవరణంలోనే కూలబడిన ఆమె కొద్ది సేపు వెక్కి వెక్కి ఏడ్చారు. నలుగురు నిందితుల్లో ఒకడైన పవన్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి ముందు పెండింగ్‌లో ఉన్నందున తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఉరిశిక్ష నిలిపివేయాలని ఢిల్లీకోర్టు ఇవాళ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి స్పందిస్తూ... ‘‘దోషులను ఉరితీయాలంటూ ఇచ్చిన సొంత ఆదేశాలను అమలు చేయడానికి కోర్టు ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నట్టు? ఉరిశిక్షను పదేపదే వాయిదా వేయడం మన వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది. మన వ్యవస్థ మొత్తం నిందితులకే మద్దతు ఇస్తుంది. ఈ కేసులో కోర్టు ఏమి చేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది....’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.