నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా..

ABN , First Publish Date - 2020-03-02T23:22:58+05:30 IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ..

నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా..

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు సోమవారంనాడు తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీలపై కోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.


దీనికి ముందు, నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే ఆ వెంటనే పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఈ మెర్సీ పిటిషన్ వేశారు. దీంతో రాష్ట్రపతి ముందు దోషులలో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున  తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ దోషులను ఉరితీయరాదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు తాజా ఆదేశాలతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది.

Updated Date - 2020-03-02T23:22:58+05:30 IST