పంజాబ్‌లో రాత్రి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-11-26T06:50:56+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ తాకిడి నేపథ్యంలో మరో రాష్ట్రం ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. డిసెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ బుధవారం ప్రకటించారు. డిసెంబరు 15వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు

పంజాబ్‌లో రాత్రి కర్ఫ్యూ

డిసెంబరు 15 వరకు అమలు.. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపు


న్యూఢిల్లీ, నవంబరు 25: కరోనా సెకండ్‌ వేవ్‌ తాకిడి నేపథ్యంలో మరో రాష్ట్రం ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. డిసెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ బుధవారం ప్రకటించారు. డిసెంబరు 15వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మాస్క్‌ ధరించని, భౌతిక దూరం పాటించనివారికి ఇప్పటివరకు రూ.500 జరిమానా విధిస్తుండగా.. దానిని రెట్టింపు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 9.30 కల్లా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మంగళవారం దేశంలో 44,376 మందికి వైరస్‌ సోకింది. 481 మంది ప్రాణాలు కోల్పోయారు.   అక్టోబరు 1వ తేదీ తర్వాత ఎన్నడూ లేనంతగా యాక్టివ్‌ కేసులు 6,079 మేర పెరిగాయి. గత నాలుగు రోజుల్లో మూడు రోజులు యాక్టివ్‌ కేసులు పెరగడం గమనార్హం. ఈ పరిణామం దేశంలో కరోనా తీవ్రత మళ్లీ అధికం అవుతోందన్న ఆందోళన కలిగిస్తోంది. 


ఢిల్లీలో కొత్తగా 6,224 కేసులు నమోదవగా, 109 మంది చనిపోయారు. వరుసగా తొమ్మిదో రోజు దేశంలో అత్యధిక కేసులు రాజధానిలోనే నమోదయ్యాయి. జాతీయ మరణాల రేటు 1.46 కాగా, ఢిల్లీలో అది 1.89గా ఉంది. అయితే, అంతకుముందటి వారంతో పోలిస్తే.. గత వారం కేసులు స్వల్పంగా తగ్గాయి. ప్రభుత్వ లెక్కల కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయంటూ బీజేపీ ఆధ్వర్యంలోని మున్సిపల్‌ పాలకవర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. వాస్తవాలను తేల్చాలని వైద్య నిపుణులను సీఎం కేజ్రీవాల్‌ కోరారు. ఢిల్లీ నుంచి వచ్చేవారికి డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాజస్థాన్‌లో ఎన్నడూ లేనంతగా3,314 కేసులు వచ్చాయి.


రష్యాలో మరణ మృదంగం

రష్యాలో కరోనా విలయం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు భారీ సంఖ్య లో మరణాలు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు 507 మంది మృతి చెందినట్టు కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం ఒక్కరోజే 491 మంది మృతి చెందినట్టు తెలిపాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 37,538కి చేరినట్టు వివరించాయి. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, బుధవారం 23,765 కొత్త కేసులు నమోదయ్యాయని వివరించాయి. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


క్రిస్మస్‌కు ఈయూలో వ్యాక్సినేషన్‌

బ్రస్సెల్స్‌: యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోని 27 దేశాల ప్రజలకు క్రిస్మస్‌ నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందనుంది. ఈవిషయాన్ని ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లియెన్‌ బుధవారం ప్రకటించారు. ఈనేపథ్యంలో వందల మిలియన్ల వ్యాక్సిన్‌ డోసుల నిల్వ, పంపిణీ, రవాణా ప్రక్రియలకు సంబంధించిన వ్యవస్థలను అత్యవసర ప్రాతిపదికన సిద్ధం చేసుకోవాలని ఈయూ దేశాలను ఆమె కోరారు. కాగా, 16 కోట్ల మోడెర్నా వ్యాక్సిన్‌ డోసుల కొనుగోలు కోసం మంగళవారం ఆ కంపెనీతో ఈయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

Updated Date - 2020-11-26T06:50:56+05:30 IST