చర్చ్‌పై దాడి : ఉగ్రవాదిగా నిరూపించాలని నిందితుని కుటుంబం డిమాండ్

ABN , First Publish Date - 2020-11-01T01:40:37+05:30 IST

ఫ్రాన్స్‌లోని నైస్ చర్చిపై ఇటీవల జరిగిన దాడిలో నిందితుని కుటుంబ సభ్యులు

చర్చ్‌పై దాడి : ఉగ్రవాదిగా నిరూపించాలని నిందితుని కుటుంబం డిమాండ్

పారిస్ : ఫ్రాన్స్‌లోని నైస్ చర్చిపై ఇటీవల జరిగిన దాడిలో నిందితుని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తన కుమారుడు ఉగ్రవాదిగా మారాడనడాన్ని తాను నమ్మలేనని నిందితుని తల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పారు. తాము పేదవారమని, తమ కుమారుడే ఇంత దారుణం చేశాడని చెప్పడానికి తగిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. 


నైస్ నగరంలోని నోట్రె డామ్ బసిలికా చర్చిపై గురువారం జరిగిన దాడి కేసులో ప్రధాన అనుమానితుడు ఇబ్రహీం ఇసాఓయీ ట్యునీషియాకు చెందినవాడు. ఈ వ్యక్తి తనంతట తాను ఈ దాడి చేశాడా? ఇతరుల ప్రమేయం ఉందా? అనే కోణంలో ఫ్రాన్స్, ట్యునీషియా, ఇటలీ దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవక్త మహమ్మద్‌ను ఎగతాళి చేస్తూ ఓ ఫ్రెంచ్ పత్రికలో కార్టూన్లు ప్రచురితమైన నేపథ్యంలో ఈ దాడి జరగడంతో, ఇది ఉగ్రవాద దాడి అని అధికారులు భావిస్తున్నారు. ఇసాఓయీని అంతకుముందు కలిసిన ఇద్దరిని అరెస్టు చేసి, ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు అధికారుల అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఓ ట్యునీషియన్ అతివాద సంస్థ ఈ దాడికి బాధ్యత తమదేనని ప్రకటించింది. 


ఇసాఓయీ స్వస్థలం సెఫాక్స్, ఆయన కుటుంబం కడు పేదరికంలో ఉంది. ఆయన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఇసాఓయీ ఈ దాడి చేశాడంటే నమ్మడం లేదు. మద్యం సేవించే అలవాటు ఉన్న ఇసాఓయీ ఫ్రాన్స్ వెళ్ళి, అక్కడ ఓ చర్చిపై దాడి చేశాడంటే తాము నమ్మలేకపోతున్నామని చెప్పారు. ఆయన తల్లి గమ్రా మాట్లాడుతూ, తన కుమారుడు ఈ దాడి చేసినట్లు చూపించే నిఘా కెమెరాల ఫుటేజ్‌ను బయటపెట్టాలని కోరారు. తన కుమారుడి హక్కులను విదేశంలో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ తన కుమారుడు తనకు కావాలన్నారు. 


ఇసాఓయీ తండ్రి, సోదరుడు మాట్లాడుతూ, తాము ముస్లింలమని, తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పారు. తాము నిరుపేదలమని తెలిపారు. దాడి చేసినట్లు నిరూపించి, ఉగ్రవాదిగా తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు. 


సెఫాక్స్ శివారులోని నజ్ర్ అనే ప్రాంతంలో ఇసాఓయీ కుటుంబం ఉంటోంది. ఈ ప్రాంతంలో సాధారణంగా అత్యధికులు నిరుపేదలే. పేదరికంతో జీవించలేనివారు ఉపాధి కోసం యూరోపు వెళ్తున్నారు. 


ఇసాఓయీ కత్తితో దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇసాఓయీ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఇసాఓయీ ఓ ఫ్రెంచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


Updated Date - 2020-11-01T01:40:37+05:30 IST