వరవరరావుకు బెయిలివ్వొద్దు

ABN , First Publish Date - 2020-08-18T07:54:25+05:30 IST

కోరేగావ్‌ భీమా కేసులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న విప్లవ కవి వరవరరావు బెయిలు వ్యాజ్యాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వ్యతిరేకించింది. ఆయనకు సాధ్యమైనంతగా అత్యుత్తమ చికిత్సను అందిసున్నామని...

వరవరరావుకు బెయిలివ్వొద్దు

  • ఆయనకు మంచి చికిత్స చేయిస్తున్నాం: ఎన్‌ఐఏ 


ముంబై, ఆగస్టు 17: కోరేగావ్‌ భీమా కేసులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న విప్లవ కవి వరవరరావు బెయిలు వ్యాజ్యాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వ్యతిరేకించింది. ఆయనకు సాధ్యమైనంతగా అత్యుత్తమ చికిత్సను అందిసున్నామని, భవిష్యత్తులో అవసరమైనప్పుడల్లా జైలు అధికారులు కూడా ఆయనకు తగిన చికిత్స అందిస్తారని ఎన్‌ఐఏ సోమవారం బాంబే హైకోర్టుకు తెలిపింది. కరోనా సోకడానికి ముందే వైద్య కారణాలపై తనకు తాత్కాలిక బెయిలు ఇవ్వాల్సిందిగా వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి జస్టిస్‌ అమ్జద్‌ సయీద్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. వరవరరావుతో ఆయన కుటుంబ సభ్యులు వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుకునేందుకు అనుమతించాలని హైకోర్టు మహారాష్ట్ర జైళ్ల శాఖ అధికారులను ఆదేశించింది. గతంలో ఎన్నో కీలకమైన కారణాల వల్లనే హైకోర్టు ఆయనకు బెయిలు తిరస్కరించిందని ఎన్‌ఐఏ తరఫున ఏఎస్జీ అనిల్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో ప్రమేయం ఉన్న కేసులో వరవరరావు నిందితుడని ఆయన పేర్కొన్నారు. వరవరరావు కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన్ని జేజే ఆస్పత్రి నుంచి నానావతి ఆస్పత్రికి తరలించామని అనిల్‌ సింగ్‌ చెప్పారు. వరవరరావు ఐసీయూలో ఉన్నారా? లేక రెగ్యులర్‌  రూమ్‌లో ఉన్నారా అని కోర్టు ఆయన్ని ప్రశ్నించింది. ఆయన్ను నిత్యం డాక్టర్లు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందా అని కూడా అడిగింది. వరవరరావుకు కరోనా వైరస్‌ సోకిన తర్వాత జూలై 16 నుంచి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 


Updated Date - 2020-08-18T07:54:25+05:30 IST