బెంగళూరు అల్లర్ల కేసులో కీలక సూత్రధారి అరెస్టు : ఎన్ఐఏ

ABN , First Publish Date - 2020-09-25T01:45:03+05:30 IST

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోస్ట్‌ను నిరసిస్తూ జరిగిన అల్లర్లకు కీలక సూత్రధారిని అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ

బెంగళూరు అల్లర్ల కేసులో కీలక సూత్రధారి అరెస్టు : ఎన్ఐఏ

బెంగళూరు : సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోస్ట్‌ను నిరసిస్తూ జరిగిన అల్లర్లకు కీలక సూత్రధారిని అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం 30 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది. 


బెంగళూరులోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమీప బంధువు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌పై నిరసన తెలిపిన కొందరు వ్యక్తులు ఆగస్టు 11న పెద్ద ఎత్తున దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో నలుగురు మరణించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ మంగళవారం చేపట్టింది. 


ఈ అల్లర్ల కేసులో సయ్యద్ సాదిక్ అలీని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈయన బ్యాంకు రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడని, ఈ అల్లర్లకు కీలక సూత్రధారి ఇతనేనని వివరించింది. 


తాము నిర్వహించిన సోదాల్లో ఎయిర్‌గన్, పెల్లెట్స్, పదునైన ఆయుధాలు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కొన్ని డిజిటల్ డివైసెస్, సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ), పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)లకు చెందిన నేరపూరిత పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 


ఆగస్టు 11 రాత్రి పులకేశినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ అఖండ శ్రీనివాస మూర్తి నివాసంపై పెద్ద ఎత్తున దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఎస్‌డీపీఐ సభ్యులు కూడా ఉన్నారు. 


Updated Date - 2020-09-25T01:45:03+05:30 IST