రజినీ... ఎందుకీ వెనకడుగు?!

ABN , First Publish Date - 2020-12-30T13:17:22+05:30 IST

రాజకీయ పార్టీ స్థాపిస్తానంటూ ప్రకటించి, పార్టీ ప్రారంభోత్సవానికి

రజినీ... ఎందుకీ వెనకడుగు?!

  • తలైవా ప్రకటనపై సర్వత్రా విస్మయం
  • ఆరోగ్యం సహకరించకపోవడమా?
  • కుటుంబంలో వ్యతిరేకతే కారణమా?
  • సర్వేల్లో వచ్చిన వ్యతిరేక ఫలితమా?
  • తర్జన భర్జనలో రజనీ అభిమానులు


చెన్నై : రాజకీయ పార్టీ స్థాపిస్తానంటూ ప్రకటించి, పార్టీ ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నాక తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వెనుకడుగు వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆఖరి నిముషంలో రజనీ ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు ఆయన బెదిరిపోయారా? లేక తన వారికి ఏమీ కాకూడదనే వెనక్కి తగ్గారా? ఇంతకీ ఆయన నిర్ణయంలో మతలబేంటి?.. ఇవీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రజనీ అభిమానుల్లో రేకెత్తుతున్న సందేహాలు.


నిజానికి పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే రజనీ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ని పీవీ వద్దకు తీసుకెళ్లిన నాటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జీకే మూపనార్‌, చిదంబరం తదితరులు రజనీయే తమిళనాడు సీఎం అభ్యర్థి అని కూడా అంగీకరించారు. ఢిల్లీలో దీనికి అంగీకరించిన రజనీ.. చెన్నైకి తిరిగి వచ్చిన మరునాడే మనసు మార్చుకున్నారు. అప్పుడు ప్రారంభమైన ఆయన సందిగ్ధత రెండేళ్ల క్రితం వరకు కొనసాగుతూనే ఉంది. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ ఆయన పదే పదే చెప్పినా.. నేరుగా రాజకీయ ప్రవేశంపై మాత్రం ఏనాడూ ప్రకటన చేయలేదు. అయితే ఎట్టకేలకు రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు రెండేళ్ల కిందట ప్రకటించిన రజనీ.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని అప్పుడే చెప్పారు. ఆ మేరకు ‘రజనీ మక్కల్‌ మండ్రం’ పేరుతో అభిమాన సంఘాన్ని బలోపేతం చేసి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. 


అదేసమయంలో జిల్లాల వారీగా అధ్యక్షులు, కార్యదర్శులను నియమించి బూత్‌స్థాయి కమిటీలను సైతం ఖరారు చేయాలని ఆదేశించారు. ఆ ఏర్పాట్లు జరుగుతుండగానే ఈ నెల 31న పార్టీ ప్రకటిస్తానని 3వ తేదీన ప్రకటించారు. దీంతో ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక, రెండు రోజుల్లో పార్టీ ప్రారంభోత్సవం ఉంటుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో రజనీ మంగళవారం చేసిన ప్రకటన అందరినీ విస్మయానికి గురిచేసింది.


సహకరించని ఆరోగ్యం!

గత పదేళ్లుగా రజనీ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. దీనికితోడు 2017లో ఆయనకు మూత్రపిండ మార్పిడి జరిగింది. అదేసమయంలో ఏడు పదుల వయసులో రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలు వచ్చాయి. ఒకవైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్య సమస్యలతో ఆయన సతమతమవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రవేశం చేయడం, ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని తలచారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన తన అభిమాన సంఘాలకు స్పష్టం చేశారు. అయితే, వారంతా పార్టీ ప్రారంభించాల్సిందేనని తీవ్ర వత్తిడి చేశారు. వారి వత్తిడికి తలొగ్గిన రజనీ పార్టీ స్థాపన వైపు అడుగులేసినా, చివరికి తను అనుకున్నదానికే కట్టుబడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక, వెండితెరపై అగ్ర నటుడిగా ఉన్న రజనీ.. రాజకీయ ప్రవేశం చేయడం వల్ల కొత్తగా వచ్చేదేమీ లేదని ఆయన కుటుంబీకులు గత కొంతకాలంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన సతీమణి లత రాజకీయ ప్రవేశంపై ససేమిరా అన్నట్లు తెలిసింది. ఇద్దరు కుమార్తెలు, అల్లుడు ధనుష్‌ కూడా అదే చెప్పినట్లు తెలిసింది. ఇంట్లో వ్యతిరేకత వ్యక్తం కావడం, సన్నిహితులు, శ్రేయోభిలాషులు వారించడంతో రజనీ రాజకీయ ప్రణాళికలను పక్కనబెట్టేసినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, సున్నిత మనస్కుడైన రజనీ విమర్శలను తట్టుకోలేరని సన్నిహితులు చెబుతున్నారు. రజనీ పార్టీ సన్నాహాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆయనపై ప్రత్యర్థి పార్టీలు విమర్శల బాణాలను ఎక్కుబెట్టాయి. మరీ ముఖ్యంగా డీఎంకే నేతలు వరుసబెట్టి విమర్శలు చేశారు. దీనిపట్ల రజనీ మనస్తాపం చెందినట్లు సమాచారం. ఇప్పుడు తను ప్రారంభించబోయే పార్టీ వల్ల ఒరిగేదెంతవరకో గానీ సన్నిహితులంతా ప్రత్యర్థులుగా మారిపోతున్నారంటూ ఆయన ఒకరిద్దరు స్నేహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. వీటన్నింటిపై తీవ్రంగా ఆలోచిస్తుండడం వల్లే ఆయన అనారోగ్యం పాలయ్యారని పోయె్‌సగార్డెన్‌ వర్గాలు చెబుతున్నాయి.


అభిమానుల అసంతృప్తి ఆందోళన

తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీ చేసిన ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన ప్రకటన చేసిన కొద్దిసేపటికే కొంతమంది అభిమానులు స్థానిక పోయె్‌సగార్డెన్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. తిరుచ్చిలో తీవ్ర కోపోద్రిక్తులైన ఆయన అభిమానులు రజనీ దిష్టిబొమ్మను, బ్యానర్లను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభిమానులు నిరసన ప్రదర్శనలు చేశారు. 


సర్వేలు కూడా కారణమేనా?

రజనీ పెట్టబోయే రాజకీయ పార్టీ పట్ల ఆయనతో సహా ఇతర పార్టీల వారు సైతం సర్వేలు నిర్వహించి జననాడి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సర్వేలన్నీ రజనీకి వ్యతిరేకంగానే వచ్చాయి. తమిళనాడులో స్థిరపడినప్పటికీ ఆయన ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని కొంతమంది అభిప్రాయపడగా, ఆయన రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదని ఇంకొందరు చెప్పారు. ఆయన పార్టీ పెడితే, ఆ పార్టీ తరఫున ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు మహా అయితే రెండంకెల సంఖ్యకు పరిమితం కావచ్చని తేలినట్లు సమాచారం. అలాంటప్పుడు ఇంత ప్రయాసపపడి పార్టీ పెట్టి కొద్దిమంది ఎమ్మెల్యేలను సాధించుకోవడం వల్ల తనకు కొత్తగా వచ్చేదేముందని రజనీ యోచించినట్లు సమాచారం. ఇదే.. రజనీ వెనక్కి తగ్గడానికి కారణమని అంటున్నారు.

Updated Date - 2020-12-30T13:17:22+05:30 IST