కమల్‌ మదిలో ఆనందం.. ఆందోళన.. ఏం జరుగునో!?

ABN , First Publish Date - 2020-12-27T17:06:42+05:30 IST

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందు ప్రచార పర్యటనను

కమల్‌ మదిలో ఆనందం.. ఆందోళన.. ఏం జరుగునో!?

చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందు ప్రచార పర్యటనను ప్రారంభించిన మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు ప్రతిచోటా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కమల్‌ ప్రచార సభలకు తరలివస్తున్న జనాన్ని చూసి అన్నాడీఎంకే, డీఎంకే తదితర ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విస్మయం చెందుతున్నాయి. కమల్‌సభలకు వచ్చే జనమంతా మక్కల్‌ నీదిమయ్యంకు ఓటేస్తే తమ పరిస్థితి ఏమిటని ఆయా పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. కమల్‌ ఇప్పటికే రెండు విడతల ప్రచార పర్యనటను ముగించి ఈనెల 27న ఆదివారం మూడో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.


తొలివిడత ప్రచారాన్ని ఈ నెల 13నుంచి మదురై, తిరునల్వేలి, దిండుగల్‌, తేని, విరుదునగర్‌ వంటి దక్షిణాది జిల్లాల్లో నిర్వహించారు. రెండో విడత ప్రచారాన్ని ఈనెల 20న ప్రారంభించి కాంచీపురం, తిరువణ్ణామలై, చెంగల్పట్టు జిల్లాల్లో పర్యటించారు. రెండువిడతల ప్రచార పర్యటన విజయవంతంగా ముగిసిందని కమల్‌హాసన్‌ పట్టరాని ఆనందంతో ఉన్నారు. తన ప్రచార సభలు, రోడ్‌షోలకు ఊహించని విధంగా వేలాదిమంది ప్రజలు హాజరవుతుండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో తన సభలకు తండోపతండాలుగా తరలివస్తున్న జనం పట్ల ఆయనకు ఓ అనుమానం కూడా కలుగుతోంది. తనను చూడటానికి, తన ప్రసంగాన్ని వినడానికి వస్తున్న వేలాదిమంది ప్రజలు మక్కల్‌ నీదిమయ్యం పార్టీకి తప్పకుండా ఓటేస్తారో లేదోననే అనుమానం కూడా కమల్‌ను పట్టిపీడిస్తోంది. 


వడివేలు గతేనా?

2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై కలిగిన కోపంతో ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వడివేలు డీఎంకేలో చేరి ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి  ప్రచారం చేశారు. ఆ సమయంలో వడివేలు నిర్వహించిన రోడ్‌షోలకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వడివేలు ప్రసంగానికి జేజేలు పలికారు. వడివేలు ప్రచార సభలలో అన్నాడీఎంకే, డీఎండీఎంకే నేతలను విమర్శిస్తూ చేసిన పంచ్‌ డైలాగులకు ప్రజలు విపరీతంగా చప్పట్లు కొట్టారు. వడివేలు ప్రచారంతో డీఎంకే సునాయాసంగా అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే   పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత వడివేలు సినిమాలకు స్వస్తి చెప్పి యేళ్ల తరబడి ఇంటిపట్టునే గడపాల్సివచ్చింది.  వడివేలు కంటే ముందే రాజకీయ ప్రవేశం చేసి పలు ఎన్నికల్లో ప్రచారం చేసిన తమిళ సుప్రీంస్టార్‌, సమత్తువ మక్కల్‌ కట్చి నాయకుడు శరత్‌కుమార్‌, సినీ అవధాని, దర్శకుడు టి.రాజేందర్‌, మరో దర్శకుడు కె.భాగ్యరాజ్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి.


ఓటు బ్యాంక్‌ పెరిగేనా?

గత లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యంకు 3.8 శాతం ఓటు బ్యాంక్‌ లభించింది. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంక్‌ తప్పకుండా పెరుగుతుందని తన సభలకు వస్తున్న జనాన్ని చూసి కమల్‌హాసన్‌ అపారమైన నమ్మకంతో ఉన్నారు. 


రజినీ వల్ల లాభమా? నష్టమా?

అదే సమయంలో తన చిరకాల సినీరంగ స్నేహితుడు రజినీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే మక్కల్‌ నీదిమయ్యానికి పడే ఓట్లు చీలిపోతాయా? ఒక వేళ రజినీ తన పార్టీతో పొత్తుపెట్టుకోకపోతే చిన్నచితకా పార్టీలతో తృతీయ కూటమిని ఏర్పాటు చేయాల్సిందేనా? ఈ ప్రశ్నలు కూడా కమల్‌ మెదడును తొలుస్తున్నాయి. ఆధ్యాత్మిక రాజకీయ స్థాపనే ధ్యేయమని స్పష్టంగా ప్రకటించిన రజినీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు అంగీకరిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం తెలియక కమల్‌ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీని ప్రారంభిస్తే తాను సీఎం పదవికి పోటీ చేయనని, పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని రజినీ గతంలోనే ప్రకటించారు. అలాంటప్పుడు రజినీ పార్టీతో పొత్తుపెట్టుకుని మక్కల్‌నీదిమ య్యం సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదిస్తే రజినీ మక్క ల్‌ మండ్రం, అభిమాన సంఘాల నాయకులు ఆదరిస్తారా? అనే అనుమానం కూడా కమల్‌ను వెన్నాడుతోంది. 


ఎన్నికల తర్వాతే యాక్టింగ్‌

కమల్‌ ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్యటనను సాగిస్తూనే  మరో వైపు శని, ఆదివారాల్లో బిగ్‌బాస్‌ సీజన్‌-4 గేమ్‌షోలో పాల్గొంటున్నారు. కమల్‌ ప్రచార పర్యటనలు సాగిస్తుండటం వల్ల శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్‌-2’ సినిమా షూటింగ్‌ అర్ధంతరంగా ఆగిపోయింది. కమల్‌ సొంత బ్యానర్‌ రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ నిర్మించనున్న ‘విక్రమ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాణ పనులేవీ ప్రారంభం కాలేదు. ఈ రెండు సినిమాల షూటింగులు వచ్చే మూడు నెలల వరకు జరగవని తెలుస్తోంది. మూడో విడత ప్రచార పర్యటన ముగిసిన తర్వాత జనవరి మొదటి వారం నుంచి ఎన్నికల మేనిఫెస్టో తయారీ, అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై చర్చలు, విరాళాల సేకరణ, ఆ తర్వాత మళ్లీ ప్రచారం అంటూ కమల్‌ బిజీగా గడపనున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు నెలల వరకూ ఆయన సినిమాల వైపు కన్నెతి చూసే ప్రసక్తి కూడా లేదు. కనుక అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఆయన పెండింగ్‌లో ఉన్న రెండు సినిమాలలో నటిస్తారని తెలుస్తోంది.

Updated Date - 2020-12-27T17:06:42+05:30 IST