కేరళలో నయా ‘యువ’ రాజకీయం

ABN , First Publish Date - 2020-12-29T09:33:21+05:30 IST

కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎల్‌డీఎఫ్‌)..

కేరళలో నయా ‘యువ’ రాజకీయం

దేశానికి ‘కేరళ మోడల్‌’ను పరిచయం చేస్తామంటున్న ఎల్‌డీఎఫ్‌


తిరువనంతపురం, డిసెంబరు 28: కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎల్‌డీఎఫ్‌).. యువ నాయకత్వం వైపు దృష్టి సారించింది. స్థానిక పాలనలో యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా దేశానికి ‘కేరళ మోడల్‌’ను పరిచయం చేయాలని నిర్ణయించింది. ఈ దిశలో తొలి అడుగుగా.. 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్‌ను తిరువనంతపురం మేయర్‌ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. అలాగే.. తిరువనంతపురం జిల్లా పంచాయతీ ప్రెసిడెంటు అభ్యర్థిగా సురేశ్‌ కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యవర్గం వీరి పేర్లను ఆమోదించిందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అవలంబిస్తామని ప్రకటించింది.  


దేశ రాజకీయాలను మలుపు తిప్పేనా!

రాజకీయాల్లో 50 ఏళ్లు పైబడ్డ వ్యక్తిని యువనేత అంటుంటారు. దీన్నిబట్టే చెప్పొచ్చు.. అక్కడ యువతకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కుతోందో! యువతను కార్యకర్తల స్థాయిలోనే ఉంచి.. పాలనా వ్యవహారాలను మొత్తం అనుభవం పేరుతో సీనియర్‌ నేతలే తమ గుప్పెట్లో ఉంచుకుంటున్నారు.  అడపాదడపా యువతకు అవకాశం ఇచ్చినా.. ఆ వ్యక్తి ఏ సీనియర్‌ నేత కుమారుడో లేదా ఏ పారిశ్రామికవేత్త పుత్రుడో అయ్యుంటాడు. ఒక చిన్న ప్రైవేటు సంస్థ కూడా తన కంపెనీలో ఉద్యోగానికి యువతకే ప్రాధాన్యం ఇస్తున్న ఈ రోజుల్లో.. దేశ భవిష్యత్తును శాసించే రాజకీయాల్లో మాత్రం సముచిత స్థానం దక్కడం లేదు. దేశంలో ఓ పదిమంది యువ పాలకుల పేర్లు వరుసగా చెప్పమంటే.. తడుముకోకుండా చెప్పలేని పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. దేశ రాజకీయాల్లో యువతకు 80, 90 దశకాల్లో ఉన్న ప్రాధాన్యం నేడు మచ్చుకైనా కనిపించని స్థితి. ఇలాంటి స్థితిలో కేరళలో అధికార ఎల్‌డీఎఫ్‌ తీసుకున్న ఈ నిర్ణయం.. యువతలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 

Updated Date - 2020-12-29T09:33:21+05:30 IST