ఆరుగురికి కొత్త స్ట్రెయిన్
ABN , First Publish Date - 2020-12-30T08:28:37+05:30 IST
యూకే నుంచి దేశానికి తిరిగివచ్చిన వారిలో ఆరుగురికి కొత్త కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది

యూకే నుంచి భారత్‌కు వచ్చినవారిలో వైరస్ గుర్తింపు
వైరస్ జన్యు విశ్లేషణ అనంతరం నిర్ధారణ
బెంగళూరులో 3, హైదరాబాద్‌లో 2, పుణెలో 1
వారిలో ఏపీలోని రాజమండ్రివాసి ఒకరు
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కరోనా
మారిన వైరస్ పైనా మా వ్యాక్సిన్ పని చేస్తుంది
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 29: యూకే నుంచి దేశానికి తిరిగివచ్చిన వారిలో ఆరుగురికి కొత్త కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ నెల 22వ తేదీ అర్థరాత్రి వరకు వివిధ విమానాశ్రాయాలకు చేరినవారిలో పాజిటివ్ వచ్చినవారి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా.. బెంగళూరు నిమ్‌హాన్స్‌లో ముగ్గురికి, హైదరాబాద్ సీసీఎంబీలో ఇద్దరికి, పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌లో ఒకరికి కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు.
వీరందరినీ ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్‌లో ఉంచారని, దగ్గరి కాంట్టాకులను క్వారంటైన్ చేశారని కేంద్రం తెలిపింది. సహ ప్రయాణికులు, కుటుంబంలో, కాంటాక్టుల గుర్తింపు కొనసాగుతోందని పేర్కొంది. నవంబరు 25- డిసెంబరు 23 మధ్య యూకే నుంచి 33 వేల మంది దేశానికి తిరిగొచ్చారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం వరకు 114 మందికి పాజిటివ్ వచ్చినట్లు వివరించింది. ఈ నెల 9 నుంచి 22వ తేదీల మధ్య భారత్‌కు చేరిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన అందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపనున్నారు. బ్రిటన్‌కు విమానాల రద్దును మరికొద్ది రోజులు పొడిగించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌లపైనా టీకాలు పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కె.విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు.
ఢిల్లీ నుంచి తప్పించుకుని వచ్చిన ఏపీ మహిళలో కొత్త స్ట్రెయిన్
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. ఈమె వారం క్రితం కుమారుడితో యూకే నుంచి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ ప్రైవేటు ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉంచగా.. చెప్పకుండా వచ్చేశారు. రైలులో రాజమండ్రి చేరుకున్నారు. ఢిల్లీ యంత్రాంగ సమాచారంతో ఏపీ అధికారులు ఇంటికెళ్లి వారిని ఆస్పత్రికి తరలించారు. శాంపిల్స్‌ను పరీక్షించగా ఆమెకు ఇక్కడా పాజిటివ్‌గా తేలింది. కుమారుడికి నెగెటివ్ వచ్చింది. మహిళ నుంచి మరో శాంపిల్ తీసి సీసీఎంబీకి పంపించారు. ఈ మహిళ రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. యూకే నుంచి వచ్చిన కాకినాడ వెంకట్ నగర్ యువకుడికి సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రైమరీ కాంటాక్ట్‌లలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది
కేంద్ర మంత్రి అశ్విని చౌబేకు పాజిటివ్
కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబేకు కరోనా సోకింది. కాగా, దేశంలో 187 రోజుల అత్యల్ప సంఖ్యలో సోమవారం 16,432 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 252 మంది మృతి చెందారు.