పాక్‌లో కొత్త రాష్ట్రం గిల్గిత్- బల్టిస్థాన్..!
ABN , First Publish Date - 2020-09-18T07:11:00+05:30 IST
పాకిస్థాన్ గురువారం నాడు ఓ అనూహ్యమైన ప్రకటన చేసింది. ఆక్రమిత కశ్మీర్లో ఓ భాగమైన గిల్గిత్-బల్టిస్థాన్ (జీబీ)ను త్వరలోనే ఓ కొత్త రాష్ట్రంగా మార్చనున్నట్లు వెల్లడించింది...

- అన్ని రాజ్యాంగ హక్కులతో ఐదో రాష్ట్రం
- ప్రకటించిన పాకిస్థాన్ మంత్రి
- త్వరలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సందర్శన
- ఆక్రమిత కశ్మీర్లో గిల్గిత్ భాగం
- పాక్ భూభాగంగా గుర్తించేది లేదని
- పలుమార్లు భారత్ స్పష్టీకరణ
అన్ని రాజ్యాంగ హక్కులతో పాక్‌లో ఐదో రాష్ట్రం
ఇస్లామాబాద్, సెప్టెంబరు 18: లద్దాఖ్‌లో భారత్ చైనా దళాలతో తలపడుతున్న వేళ... పాకిస్థాన్ గురువారం నాడు ఓ అనూహ్యమైన ప్రకటన చేసింది. ఆక్రమిత కశ్మీర్లో ఓ భాగమైన గిల్గిత్-బల్టిస్థాన్ (జీబీ)ను త్వరలోనే ఓ కొత్త రాష్ట్రంగా మార్చనున్నట్లు వెల్లడించింది. ‘‘ అన్ని రాజ్యాంగ హక్కులతో జీబీ స్థాయిని పెంచుతాం. ఓ రాష్ట్రంగా చేసి- జాతీయ అసెంబ్లీ, సెనెట్‌ల్లో, ఇతర రాజ్యాంగ సంస్థల్లో ప్రాతినిథ్యం కల్పిస్తాం. అక్కడున్న అందరు ప్రముఖులు, ప్రజానీకంతో మాట్లాడిన తరువాతే రాష్ట్రంగా మార్చాలన్న నిర్ణయానికి వచ్చాం. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ త్వరలోనే జీబీకి వెళ్లి ఇందుకు సంబంధించి లాంఛనంగా ప్రకటన చేస్తారు’’ అనిపాక్ ప్రభుత్వ కశ్మీర్, గిల్జిట్-బల్టిస్థాన్ వ్యవహారాల మంత్రి అలీ అమీన్ గండాపూర్ మీడియాకు చెప్పారు. ‘‘ఇది ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అంశం. 73 ఏళ్లుగా అక్కడి ప్రజలు తమ చట్టబద్ధ హక్కులకు దూరమయ్యారు. మేం ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాం. అక్కడి ప్రజలు కూడా పాక్‌తో పూర్తిస్థాయి విలీనాన్ని కోరుకుంటున్నారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నవంబరులోనే ఎన్నికలు కూడా జరుపుతామని, డీలిమిటేషన్ కూడా పూర్తయిందని ఆయన పేర్కొన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక ఓ వార్తా కథనంలో వివరించింది. జీబీని పాక్ ఇన్నాళ్లూ ‘నార్తర్న్ ఏరియాస్’ (ఉత్తరప్రాంతం) అని వ్యవహరిస్తోంది.
గిల్గిత్ బల్టిస్థాన్ గ్రేటర్ కశ్మీర్లో భాగమని భారత్ దశాబ్దాలుగా స్పష్టం చేస్తూ వచ్చింది. 1947 దేశ విభజన సమయంలో పాక్ ఆ ప్రాంతాన్ని, ప్రస్తుతం ఆజాద్ కశ్మీర్‌గా పిలుస్తున్న ప్రాంతాలను అక్రమంగా కలిపేసుకుంది. ‘జీబీపై పాక్ ప్రభుత్వానికి గానీ, అక్కడి న్యాయవ్యవస్థకు గానీ ఎలాంటి హక్యూ, అధికారం, మాట్లాడే అర్హతా లేవు. అది కశ్మీర్లో అంతర్భాగం’’ అని ఈ ఏడాది మే నెలలో కూడా భారత్ విస్పష్టంగా పేర్కొంది. అయితే పాక్ మాత్రం చైనాతో చేతులు కలిపింది. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) కింద జీబీలో ఓ ప్రత్యేక ఆర్థిక మండలిని కూడా ఏర్పాటు చేసింది. చైనాలోని జిన్‌జియాంగ్ రాష్ట్రం ఈ జీబీకి తూర్పు సరిహద్దు..! చారిత్రకంగా అమిత ప్రాధాన్యమున్న సిల్క్ రోడ్‌లో జీబీ ఉండడంతో వాణిజ్య కార్యకలాపాలు ప్రధానంగా చైనాకు, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు జరిగేవి. బలూచిస్థాన్‌లోని గ్వడర్ నౌకాశ్రయాన్ని జిన్‌జియాంగ్‌తో సీపీఈసీ కలుపుతుంది. గిల్గిత్ బాల్టిస్థాన్ తమ భూభాగమని, దాని ద్వారా ఆర్థిక కారిడార్ నిర్మించడం అక్రమమని అనేకసార్లు భారత్ తన నిరసనను చైనాకు కూడా తెలియజేసింది.
షియాల ఊచకోత
1970 నుంచే పాక్ గిల్జిట్-బల్టిస్థాన్‌ను ‘నార్తర్న్ ఏరియాస్’ గా ప్రకటించింది. గిల్గిత్ ఏజెన్సీని, బల్టిస్థాన్‌ను, పక్కనే ఉన్న చిన్న చిన్న రాజసంస్థానాలు- హుంజా, నగర్‌లను విలీనం చేసి ప్రత్యేక పాలనా మండలిగా చేసింది. 2009లో దానికి పరిమిత స్వయం ప్రతిపత్తి కల్పించింది. సుమారు 73వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ ప్రాంత జనాభా దాదాపు 16 లక్షలు. ఒకప్పుడిది షియా ప్రాబల్యప్రాంతం. వారిలో అత్యధికులు భారత్ అనుకూలురు. ఇది గ్రహించి పాక్ దీని జనాభా సరళిని మార్చేసింది. 1988లో ఐఎ్‌సఐ-ప్రేరేపిత ఉగ్రవాదులు చెలరేగిపోయి సుమారు 3000 మంది షియాలను చంపేశారు. దాంతో వేల మంది షియాలు ప్రాణాలరచేత పెట్టుకుని తలోదిక్కూ తరలిపోయారు. ఒకప్పుడు 80శాతం ఉన్న షియాలు ఇపుడు 39 శాతానికి తగ్గిపోయారు. సున్నీలు 27శాతం, ఇస్మాయిలీలు 18 శాతం, నర్బక్షాహీలు 16 శాతం ఇపుడున్నారు. హిమవత్పర్వత ప్రాంతమైన జీబీలో దాదాపు 55 దాకా 7000 మీటర్ల ఎత్తయిన శిఖరాలున్నాయి. మూడు అద్భుతమైన గ్లేసియర్లు ఉన్నాయి. టూరిజం, పర్వతారోహణకు ఇది పెట్టింది పేరు.
కశ్మీర్ విభజన తరువాతే..?
కశ్మీర్‌ను రెండు ముక్కలుగా చేస్తూ జమ్మూ- కశ్మీర్‌ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను రెండో ప్రాంతంగా మారుస్తూ కేంద్రం నిరుడు చట్టం చేసిన తరువాత పాక్ లో కూడా దీనిపై దృష్టి మరలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కొందరు బీజేపీ నేతలతో పాటు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు పాక్‌పై ఒత్తిడి పెంచాయి. ఎప్పటికైనా భారత్ దీన్ని స్వాధీనపరుచుకుంటుందేమోనన్న సందేహాలు పాక్ పాలకుల్లో నెలకొన్నాయి. దీంతో ప్రస్తుతం ముజఫరాబాద్, మిగిలిన ప్రాంతాలతో ఉన్న ఆజాద్ కశ్మీర్‌ను పక్కన పెట్టి చైనాకు దగ్గరగా ఉన్న గిల్గిత్-బల్టిస్థాన్‌ను రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
