చెన్నైలో కొత్త కరోనా భయం.. ఐసోలేషన్‌లో 499 మంది

ABN , First Publish Date - 2020-12-25T16:31:40+05:30 IST

కరోనా స్ట్రెయిన్‌ నగరవాసులకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో

చెన్నైలో కొత్త కరోనా భయం.. ఐసోలేషన్‌లో 499 మంది

  • విమాన ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి
  • లండన్‌ నుంచి కార్గో విమానంలో వచ్చిన 9 మందికి కరోనా పరీక్షలు
  • ఐసోలేషన్‌లో 499 మంది

చెన్నై : కరోనా స్ట్రెయిన్‌ నగరవాసులకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో చెన్నైలో బ్రిటన్‌ నుంచి వస్తున్న విమాన ప్రమాణికులపై నిఘా తీవ్రం చేశారు. బ్రిటిష్‌ రాజధాని లండన్‌ నుంచి కార్గో విమానంలో గురువారం వేకువజామున చెన్నై వచ్చిన పైలెట్‌ సహా తొమ్మిదిమందికి రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిని స్థానిక స్టార్‌ హోటల్‌లోని ఐసోలేషన్‌లో ఉంచారు. బ్రిటన్‌లో కరోనా వైరస్‌ రూపుమార్చుకుని కరోనా స్ట్రెయిన్‌గా వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో లండన్‌కు విమాన సేవలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 


అదే సమయంలో లండన్‌ నుంచి సరకుల రవాణా (కార్గో) విమానాలను నడుపుకునేందుకు అనుమతినిచ్చింది. చెన్నైకి రోజూ వేకువజామున 5.30కి వచ్చే కార్గో విమానానికి, చెన్నై నుంచి ఉదయం 7.30 గంటలకు రోజూ లండన్‌కు బయల్దేరే విమానానికి అనుమతించారు. ఆ మేరకు గురువారం వేకువజామున లండన్‌ నుంచి కార్గో విమానం చెన్నైలో దిగింది. ఆ విమానంలో ఉన్న పైలెట్లు, ఇంజనీర్లు, సహా తొమ్మిది మందిని చెన్నై విమానాశ్రయంలో ఉన్న ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక వైద్య శిబిరానికి తరలించారు. అక్కడ వారికి వైద్యనిపుణులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని నగరంలోని హోటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. కార్గో విమానంలోని సరకులన్నింటినీ కార్మికులు అన్‌లోడ్‌ చేసి, చెన్నై నుంచి వెళ్ళాల్సిన సరుకులను ఎక్కించారు. ఆ విమానాన్ని ఇదివరకే చెన్నై వచ్చిన పైలెట్లు నడిపారు. ఆ విమానంలో కొంతమంది సిబ్బంది కూడా ఎక్కారు. ఆ తర్వాత ఆ కార్గో విమానం ఉదయం 7.30 గంటలకు లండన్‌ బయల్దేరి వెళ్ళింది.


ఇదిలా ఉండగా గత రెండువారాల వ్యవధిలో లండన్‌ నుంచి విమానాల్లో చెన్నైకి వచ్చిన 499 మందిపై గ్రేటర్‌  చెన్నై కార్పొరేషన్‌ ఆరోగ్యశాఖ అధికారులు నిఘా పెట్టారు. నగరంలో పలుచోట్ల నివసిస్తున్న వీరికి రోజూ ఆరోగ్యశాఖ అధికారులు ఫోన్‌ చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. తమకు తెలియకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళ కూడదని కూడా ఆంక్షలు విధించారు. అంతే కాకుండా  499 మంది ఉంటున్న ఇళ్ల వద్దకు స్థానికంగా ఉన్న కార్పొరేషన్‌ ఆరోగ్య కార్యకర్తలు రోజూ వెళ్ళి వారికి థర్మల్‌స్కాన్‌, శ్వాబ్‌, ఆక్సీమీటర్‌ పరీక్షలు జరుపుతున్నారు.


ఆందోళన వద్దు

రూపాంతరం చెందిన కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి.విజయభాస్కర్‌ తెలిపారు. పుదుకోట జిల్లా విరాలిమలై సమీపం వీరపట్టిలో ఏర్పాటు చేసిన అమ్మా మినీ క్లినిక్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లండన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల గళ్ల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపామన్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తితో 37 మంది ప్రయాణించారని, వారిలో 33 మందికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. గత నెల 25వ తేది నుంచి బుధవారం వరకు పలు దేశాల నుంచి లండన్‌ మీదుగా పలు విమానాల్లో 2,800 మంది రాష్ట్రానికి వచ్చారన్నారు. వారి వివరాలు సేకరించడంతో పాటు వారిని ఆరోగ్య, పోలీసు, స్థానిక సంస్థల శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

Updated Date - 2020-12-25T16:31:40+05:30 IST