బోంబే హైకోర్టు సీజేగా జస్టిస్ దీపాంకర్ ప్రమాణం
ABN , First Publish Date - 2020-04-29T01:17:55+05:30 IST
బోంబే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం చేశారు...

ముంబై: బోంబే హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఇవాళ ఆయన చేత రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్-19 నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు కొద్దిమంది హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ భూషణ్ ధర్మాధికారి స్థానంలో జస్టిస్ దీపాంకర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
1965 ఫిబ్రవరి 9న జన్మించిన జస్టిస్ దత్తా... 1989 నవంబర్ 16న న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించినట్టు రాజ్‌భవన్ వెల్లడించింది. 2006 జూన్ 22న కలకత్తా హైకోర్టులో ఆయన శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా అంతకు ముందు ఆయన కలకత్తా హైకోర్టు, గౌహతి హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టు సహా సుప్రీంకోర్టులోనూ 16 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు.