మోదీ ‘మన్‌ కీ బాత్‌’పై నెటిజెన్ల సెటైర్లు

ABN , First Publish Date - 2020-12-27T17:54:26+05:30 IST

భారతీయ జనతా పార్టీ అధికారిక యూట్యూబ్‌ ఛానల్, నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌‌లో మోదీ మన్ కీ బాత్‌ వీడియోపై డిస్‌లైక్‌లతో విరుచుకుపడ్డారు. దీంతో తర్వాతి నెల మన్ కీ బాత్ కార్యక్రమానికి కామెంట్లు, లైక్‌లు కనిపించకుండా డిసేబుల్ చేశారు.

మోదీ ‘మన్‌ కీ బాత్‌’పై నెటిజెన్ల సెటైర్లు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 72వ 'మన్‌ కీ బాత్'‌ కార్యక్రమంపై నెటిజెన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఒకవైపు యూట్యూబ్‌లో డిస్‌లైక్‌తో విరుచుకుపడుతూనే మరోవైపు ఇతర సామాజిక వేదికల్లో ‘మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా భారీ ఆదరణే లభించింది. అయితే ఈ యేడాది ఆగస్టులో మొదటిసారి మన్ కీ బాత్‌పై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తెంది. భారతీయ జనతా పార్టీ అధికారిక యూట్యూబ్‌ ఛానల్, నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌‌లో మోదీ మన్ కీ బాత్‌ వీడియోపై నెటిజెన్లు డిస్‌లైక్‌లతో విరుచుకుపడ్డారు. దీంతో తర్వాతి మన్ కీ బాత్ కార్యక్రమానికి కామెంట్లు, లైక్‌లు కనిపించకుండా డిసేబుల్ చేశారు.


ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో నేటి మన్ కీ బాత్‌పై కూడా ప్రతికూల స్పందన వస్తుందనే చర్చ ఇప్పటికే జరిగింది. ముందుగా వచ్చిన ఊహగాణలకు తగ్గట్టుగానే మోదీ మన్ కీ బాత్‌పై నెటిజెన్లు తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో మోదీ మన్ కీ బాత్‌ వీడియోపై డిస్‌లైక్‌ల పరంపర మళ్లీ ప్రారంభమైంది. ఆ వీడియోకు వచ్చిన లైక్‌ల కంటే ఎక్కువ సంఖ్యలో డిస్‌లైకులు వస్తున్నాయి.


ఇక ట్విట్టర్‌లో అయితే ‘మోదీ బక్వాస్ బంద్ కరో’ (మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి) అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కాగానే ఈ హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘‘మోదీజీ.. మన్ కీ బాత్ కాదు, నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న నిరవధిక నిరసనపై మాట్లాడండి’’ అంటూ ఒక నెటిజెన్ స్పందించగా, ‘‘దేశ ప్రజలు చెప్పే విషయాన్ని మోదీ వినరు.. కానీ ఆయన మన్ కీ బాత్ అందరూ వినాలి’’ అంటూ మరో నెటిజెన్ రాసుకొచ్చారు.

Updated Date - 2020-12-27T17:54:26+05:30 IST