బిహార్‌లో రీకౌంటింగ్‌కు నెటిజెన్ల డిమాండ్

ABN , First Publish Date - 2020-11-13T21:40:19+05:30 IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి (మహాగట్‌బంధన్) విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పటినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే విజయం సాధించింది. 125 స్థానాలతో ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకోగా మహాకూటమి 110 స్థానాలకే పరిమితమైంది.

బిహార్‌లో రీకౌంటింగ్‌కు నెటిజెన్ల డిమాండ్

పాట్నా: బిహార్ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ సహా ప్రతిపక్షాల పార్టీలన్నీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ఆలస్యంగా జరగడంపై కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే ఆర్జేడీ నేత మనోజ్ ఝా పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. అనంతరం, కౌంటింగ్ ముగింపు దశకు వస్తున్నా కొద్ది దీనిపై రగడ పెరుగుతూ వచ్చింది. ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌంటింగ్‌లో కానీ ఈవీఎంలలో కానీ ఎలాంటి పొరపాట్లు జరగడం లేదని వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు బెట్టు వీడటం లేదు. తాజాగా నెటిజెన్లు సైతం ఈ విషయమై నినదిస్తున్నారు. ఈరోజు ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్‌లో ‘‘బిహార్ రీకౌంటింగ్ కోరుతోంది’’ అనే హ్యాష్‌ట్యాగ్ మొదటి స్థానంలో ఉంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌పై ఇప్పటికే 1.12 లక్షల ట్వీట్లు చేశారు. ఎన్నికల సంఘం విశ్వాసం పోగొట్టుకుంటుందని, స్వతంత్ర సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని నిరూపించుకోవాలంటే మళ్లీ రీకౌంటింగ్ చేయాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.


‘‘ప్రజలు మాకు మద్దతుగా ఓట్లు వేస్తే, ఎన్నికల సంఘం ఎన్డీయేకు మద్దతుగా ఫలితాలు విడుదల చేసింది’’ అంటూ ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మొత్తంగా ఓట్ల శాతంలో మహాగట్‌బంధన్ ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకు ఎక్కువ సీట్లు రావడం ఏంటని ప్రతిపక్ష నేతల వాదన. చాలా స్థానాల్లో తక్కువ మెజారిటీతో ఎన్డీయే అభ్యర్థులు గెలవడాన్ని ఆర్జేడీ సవాల్ చేస్తోంది. తమ అభ్యర్థులు గెలిచారని ముందు ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్డీయే అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తేజస్వీ యాదవ్ అన్నారు. ఇదే విషయమై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. బీజేపీకి వచ్చే ఓట్ల శాతానికి సీట్లకు సంబంధం ఉండడం లేదని, ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద సవాల్ అని ఆయన అన్నారు.


బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి (మహాగట్‌బంధన్) విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పటినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే విజయం సాధించింది. 125 స్థానాలతో ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకోగా మహాకూటమి 110 స్థానాలకే పరిమితమైంది.

Updated Date - 2020-11-13T21:40:19+05:30 IST