సంకట వేళ ప్రధానిగా నెతన్యాహు ప్రమాణం... జంబో కేబినెట్‌పై వెల్లువెత్తుతోన్న విమర్శలు

ABN , First Publish Date - 2020-05-17T23:15:54+05:30 IST

టెల్ అవీవ్: ఇజ్రాయిల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణం చేశారు. కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో 36 మంది మంత్రులుగా, 16 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

సంకట వేళ ప్రధానిగా నెతన్యాహు ప్రమాణం... జంబో కేబినెట్‌పై వెల్లువెత్తుతోన్న విమర్శలు

టెల్ అవీవ్: ఇజ్రాయిల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణం చేశారు. కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో 36 మంది మంత్రులుగా, 16 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. 

ఇజ్రాయిల్‌లో ఏడాదిన్నరగా రాజకీయ అస్థిరత నెలకొంది. ఏడాదిలోనే మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. కరోనా సంకట వేళ దేశ ఆర్ధిక స్ధితిని దృష్టిలో పెట్టుకుని అభిప్రాయబేధాలను పక్కన పెట్టాలని ఇజ్రాయిల్ మాజీ ఆర్మీ చీఫ్ గంట్జ్, ప్రధానమంత్రి నెతన్యాహు నిర్ణయించడంతో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. తొలి 18 నెలలు నెతన్యాహు ప్రధానిగా ఉంటారు. ఏడాదిన్నర తర్వాత గంట్జ్ ప్రధాని అవుతారు. ఇద్దరి మధ్యా పదవీకాలానికి సంబంధించి అంగీకారం కుదరడంతో పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుత కాలంలో గంట్జ్ రక్షణ మంత్రిగా వ్యవహరిస్తారు. 

నెతన్యాహుపై ఆర్ధికపరమైన అవకతవకలపై ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఆయనపై విచారణ కూడా కొనసాగనుంది. కరోనా వేళ ఆర్ధికపరమైన సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జంబో కేబినెట్ ఏర్పాటు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చిన్న చిన్న పార్టీల మద్దతు తప్పనిసరి కావడంతో అందరికీ చోటు కల్పించే ఉద్దేశంతో జంబో కేబినెట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-05-17T23:15:54+05:30 IST