నీరవ్ మోదీ సోదరునిపై అమెరికాలో చీటింగ్ కేసు
ABN , First Publish Date - 2020-12-20T19:11:02+05:30 IST
బ్యాంకులను మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ

న్యూఢిల్లీ : బ్యాంకులను మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ సోదరుడు నెహల్ మోదీపై అమెరికాలో చీటింగ్ కేసు నమోదైంది. నెహల్ వజ్రాల వ్యాపారంలో ఓ కంపెనీని 1 మిలియన్ డాలర్ల మేరకు మోసగించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. మన్‌హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సై వాన్స్ జూనియర్ కార్యాలయం డిసెంబరు 18న విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలను తెలిపారు.
ఈ స్టేట్‌మెంట్ ప్రకారం, నెహల్ మోదీ అమెరికాలోని ఎల్ఎల్‌డీ డైమండ్స్ నుంచి 2.6 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలను తప్పుడు సమాచారం ఇచ్చి పొందినట్లు కేసు నమోదైంది. వజ్రాల కోసం సానుకూల నిబంధనలతో రుణాన్ని పొందినట్లు, అనంతరం ఆ వజ్రాలను తన సొంత అవసరాల కోసం నగదుగా మార్చుకుని, వాడుకున్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి.
సై వాన్స్ జూనియర్ శుక్రవారం విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో వజ్రాలు శాశ్వతంగా ఉంటాయని, ఈ లోపభూయిష్టమైన పథకం మాత్రం అలా కాదని పేర్కొన్నారు. నెహల్ మోదీపై వచ్చిన ఆరోపణలపై న్యూయార్క్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందన్నారు. నెహల్ మోదీ ఎల్ఎల్‌డీ డైమండ్స్ సంస్థను సంప్రదించి, కాస్ట్‌కో హోల్‌సేల్ కార్పొరేషన్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని అబద్ధం చెప్పారన్నారు. 8 లక్షల డాలర్ల విలువైన వజ్రాలను అమ్మకం కోసం కాస్ట్‌కోకు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అనంతరం ఈ డీల్‌కు కాస్ట్‌కో అంగీకరించిందని ఎల్ఎల్‌డీకి అబద్ధం చెప్పారన్నారు. ఎల్ఎల్‌డీ నుంచి వజ్రాలను రుణంపై కొన్నారని, ఈ వజ్రాలను స్వల్పకాలిక రుణం తీసుకునేందుకు తాకట్టుపెట్టారని చెప్పారు. ఆ సొమ్మును వ్యక్తిగతంగా వాడుకున్నారని తెలిపారు.
2015 ఏప్రిల్, మే నెలల్లో నెహల్ మోదీ మరో మూడుసార్లు ఎల్ఎల్‌డీకి వెళ్ళారు. అమ్మకం కోసం 1 మిలియన్ డాలర్లకు పైగా విలువైన వజ్రాలను కాస్ట్‌కో కోసం తీసుకెళ్ళారు. ఎల్ఎల్‌డీకి మోదీ చాలాసార్లు సొమ్ము చెల్లించారు. లాభాల్లో ఎక్కువ శాతం సొమ్మును తన సొంతం కోసం, ఇతర వ్యాపార ఖర్చుల కోసం వాడుకున్నారు.
ఎట్టకేలకు నెహల్ మోదీ మోసాన్ని ఎల్ఎల్‌డీ గుర్తించింది. తక్షణమే మొత్తం సొమ్మును చెల్లించాలని, లేదంటే వజ్రాలను తిరిగి ఇచ్చేయాలని కోరింది. అయితే అప్పటికే మోదీ ఆ వజ్రాలను అమ్మేయడం కానీ, తాకట్టు పెట్టడం కానీ జరిగిపోయింది. తద్వారా వచ్చిన సొమ్మును వాడుకోవడం కూడా జరిగిపోయింది. దీంతో ఎల్ఎల్‌డీ మన్‌హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. న్యూయార్క్ సుప్రీంకోర్టు నెహల్ మోదీపై ఆరోపణలు నమోదు చేసింది.
సీబీఐ కేసుల్లో కూడా...
నీరవ్ మోదీ, నెహల్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 2 బిలియన్ డాలర్లు రుణం పొంది, మోసం చేసినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. వీరిద్దరిపైనా సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. నెహల్ మోదీ దుబాయ్‌లో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.