నెలకు రూ.14 వేల సంపాదన.. 80 ఏళ్ల మహిళ బ్యాంకు ఖాతాలో రూ. 200 కోట్లు

ABN , First Publish Date - 2020-07-20T02:16:25+05:30 IST

తన నెల సంపాదన రూ. 14 వేలు అని చెబుతున్న 80 ఏళ్ల మహిళ స్విస్ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.196 కోట్లు ఉండడా

నెలకు రూ.14 వేల సంపాదన.. 80 ఏళ్ల మహిళ బ్యాంకు ఖాతాలో రూ. 200 కోట్లు

ముంబై: తన నెల సంపాదన రూ. 14 వేలు అని చెబుతున్న 80 ఏళ్ల మహిళ స్విస్ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.196 కోట్లు ఉండడాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. జరిమానాతో కలిపి ట్యాక్స్ చెల్లించాలంటూ ముంబై బ్రాంచ్ ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) ఆమెను ఆదేశించింది. 


రేణు తరణికి హెచ్‌ఎస్‌బీసీ జెనీవాలో ఖాతా ఉంది. తరణి ఫ్యామిలీ ట్రస్ట్ పేరుతో ఉన్న ఈ ఖాతాకు తరణి లబ్ధిదారు. జులై 2004లో కేమన్ ఐలండ్స్‌కు చెందిన జీడబ్ల్యూ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఈ ఖాతాను తెరిచారు. అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న జీడబ్ల్యూ ఇన్వెస్ట్‌మెంట్ తరణి ఫ్యామిలీ ట్రస్ట్‌కు నిధులు బదిలీ చేసింది. 


2005-06లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తరణి ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. 31 అక్టోబరు 2014లో ఈ కేసును తిరిగి తెరిచారు. మరోవైపు, తనకు హెచ్‌ఎస్‌బీసీ జెనీవాలో తనకు ఎటువంటి ఖాతా లేదని, జీడబ్ల్యూ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులతో తాను షేర్ హోల్డర్‌ను కాదని తరణి అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. తాను నాన్-రెసిడెంట్‌నని, ఒక వేళ ఆ ఖాతాలో డబ్బులు ఉన్నా తాను పన్ను కట్టబోనని అందులో పేర్కొన్నారు. 


2005-06లో తరణి తన వార్షిక ఆదాయం రూ.1.7 లక్షలు మాత్రమేని పేర్కొన్నారు. తనది బెంగళూరుని, తాను క్రమం తప్పకుండా పన్ను కడుతున్నట్టు తెలిపారు. అయితే, ఆమె మొదటి సంవత్సరం నాన్-రెసిడెన్షియల్ హోదాలో ఉండి ఉండొచ్చని ఐటీఏటీ బెంచ్ పేర్కొంది. ఇంత తక్కువ వ్యవధిలో ఆమె బ్యాంకు ఖాతాలోకి రూ.200 కోట్లు ఎలా వచ్చాయన్న విషయాన్ని బెంచ్ గుర్తించలేకపోయింది. ఆమె పబ్లిక్ ఫిగర్ కాదని, అలాగని చారిటీ కూడా నిర్వహించడం లేదని, మరి అంత సొమ్ము ఆమె ఖాతాలోకి ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తోంది.

Updated Date - 2020-07-20T02:16:25+05:30 IST