బిహార్ ఎన్డీయే పక్ష నేత ఎన్నిక ఆదివారం : నితీశ్ కుమార్
ABN , First Publish Date - 2020-11-13T20:11:57+05:30 IST
బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడంతో
పాట్నా : బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడంతో శాసన సభా పక్ష నేతను ఎన్నుకునేందుకు ఆదివారం సమావేశం కాబోతోంది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్డీయే పక్షాల శాసన సభ్యుల సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలన్నిటినీ తెలియజేస్తామని వివరించారు.
బిహార్ మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం జరుగుతుందని నితీశ్ కుమార్ చెప్పారు. 243 శాసన సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ఆధిక్యం సాధించింది. బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎంఎస్ కలిసి పోటీ చేసి, 125 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ ఎమ్మెల్యేలంతా ఆదివారం సమావేశమవుతారు. బీజేపీకి 74, జేడీయూకు 43, వీఐపీ, హెచ్ఏఎంఎస్‌లకు చెరొక నాలుగు స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా నితీశ్ కుమార్ తన విమర్శకులకు ఓ విన్నపం చేశారు. తనను అహంభావిగా ముద్ర వేయవద్దని కోరారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో నితీశ్ కనీసం ఒకసారి అయినా విలేకర్ల సమావేశం నిర్వహించకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలతో మాట్లాడకుండా మౌనంగా ఉండటం అహంకారమేనని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మీడియా గురువారం అడిగిన ప్రశ్నకు నితీశ్ స్పందిస్తూ, తనపై అటువంటి ముద్ర వేయవద్దని కోరారు.