'ఒక్క అబ్బాయి కోసం ఐదుగురు అమ్మాయిలు' కామెంట్‌పై ఎన్‌సీడబ్ల్యూ సీరియస్

ABN , First Publish Date - 2020-06-26T01:52:24+05:30 IST

ట్విటర్ వేదికగా లింగవివక్ష ప్రదర్శించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే జితేంద్ర...

'ఒక్క అబ్బాయి కోసం ఐదుగురు అమ్మాయిలు' కామెంట్‌పై ఎన్‌సీడబ్ల్యూ సీరియస్

న్యూఢిల్లీ: ట్విటర్ వేదికగా లింగవివక్షను ప్రతిబింబించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే జితేంద్ర పట్వారీపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం సహా పలు ఆర్థిక సమస్యలను ఆడపిల్లలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది. "ప్రజలంతా కొడుకు కావాలని కోరుకుంటున్నారు. కానీ, కుమార్తెలు మాత్రమే పుడుతున్నారు. అభివృద్ధి అనే కొడుకు మాత్రం పుట్టడం లేదు" అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి పట్వారీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే.


ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం ఇలా ఐదుగురు ‘‘కుమార్తెలు’’ పుట్టారుగానీ.. అభివృద్ధి అనే ‘‘కొడుకు’’పుట్టలేదని పట్వారీ ట్వీట్ చేశారు. దీన్ని సుమోటోగా తీసుకున్న ఎన్‌సీడబ్ల్యూ చైర్మన్ రేఖా శర్మ... సదరు అభ్యంతరకర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మహిళలపై వివక్షకు కారణమయ్యే ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ట్వీట్ ద్వారా సమాజంలోకి ఆయన తప్పుడు సందేశాన్ని పంపారని రేఖా శ్ పేర్కొన్నారు. ‘‘ఓ రాజకీయ నాయకుడు ఆడపిల్లలపై ఇలాంటి వివక్షతో కూడిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదు..’’ అని మహిళా కమిషన్ హితవు పలికింది.

Updated Date - 2020-06-26T01:52:24+05:30 IST