పాక్ డ్రోన్లకు ఇజ్రాయెల్ ‘స్మాష్‌’తో చెక్!

ABN , First Publish Date - 2020-12-10T20:10:01+05:30 IST

డ్రోన్లకు చెక్ పెట్టేందుకు భారత నేవీ ఇజ్రాయెల్ కంపెనీ రూపొందించిన స్మాష్-2000(ఎస్ఎమ్ఏఎస్‌హెచ్) ఫైర్ కంట్రోల్ వ్యవస్థ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది.

పాక్ డ్రోన్లకు ఇజ్రాయెల్ ‘స్మాష్‌’తో చెక్!

న్యూఢిల్లీ: డ్రోన్స్..ప్రస్తుతం మిలిటరీ వ్యూహాలను సమూలంగా మార్చేస్తున్న పేరిది. ఒకప్పుడు యుద్ధం అంటే..ట్యాంకులు,క్షిపణులు, వివిధ సైనిక రెజిమెంట్లు, వాటి వ్యూహాత్మక మోహరింపు వంటివి గుర్తుకు వచ్చేవి. కానీ డ్రోన్ల అభివృద్ధితో యుద్ధ రంగంలో, వ్యూహాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. శత్రుసైనికుల కంటికి కనిపించకుండా డ్రోన్ల సాయంతో భీకర దాడులు చేసి వారిని కోలుకోలేని దెబ్బకొట్టొచ్చు. అందుకే..ప్రస్తుతం డ్రోన్ల వ్యవస్థకు ఎంతో డిమాండ్ ఉంది. డ్రోన్లే ప్రధానఅస్త్రాలుగా కూడా మిలిటరీ వ్యూహాలు  రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవల అజర్‌బైజాన్, ఆర్మేనియా మద్య జరిగిన యుద్ధం కారణంగా మిలిటరీ వ్యూహాల్లో డ్రోన్ల ప్రాధాన్యం పతాక స్థాయికి చేరుకుంది.


ఇక భారత్ విషయానికి వస్తే.. కశ్మీర్‌లో అశాంతి రేకెత్తించేందుకు దయాది దేశం పాకిస్థాన్ ఇటీవల కాలంలో డ్రోన్ల మీదే అధికంగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్లకు చెక్ పెట్టేందుకు భారత నేవీ ఇజ్రాయెల్ కంపెనీ రూపొందించిన స్మాష్-2000(ఎస్ఎమ్ఏఎస్‌హెచ్) ఫైర్ కంట్రోల్ వ్యవస్థ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది.  ఏకే-47, ఏకే-203 తుపాకులపై అమర్చే స్మాష్ వ్యవస్థతో డ్రోన్లను మరింత కచ్చితత్వంతో టార్గెట్ చేయచ్చు. దీంతో..సైనికుల్లో డ్రోన్లను టార్గెట్ చేసే వేగం పెరగడంతో పాటూ, మరింత కచ్చితత్వంతో వాటిని టార్గెట్ చేసి కూల్చే అవకాశం కలుగుతుంది. కాగా..  మొత్తం ఎన్ని స్మాష్-2000 వ్యవస్థలు కొనుగోలు చేస్తోందనేది మాత్రం నేవీ వెల్లడించలేదు. అయితే..ఆర్మీ, బీఎస్ఎఫ్ వర్గాలు కూడా ఈ వ్యవస్థ కొనుగోలుకు ఇజ్రాయెల్ కంపెనీతో చర్చలు ప్రారంభించాయని సమాచారం. 



Updated Date - 2020-12-10T20:10:01+05:30 IST