నవీ ముంబై మార్కెట్ సోమవారం నుంచి పునఃప్రారంభం

ABN , First Publish Date - 2020-05-17T21:59:04+05:30 IST

కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరగడంతో ఓ వారం నుంచి మూతపడిన

నవీ ముంబై మార్కెట్ సోమవారం నుంచి పునఃప్రారంభం

ముంబై : కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరగడంతో ఓ వారం నుంచి మూతపడిన నవీ ముంబై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కార్యకలాపాలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతాయి. నవీ ముంబై నగర పాలక సంస్థ, మార్కెట్ కమిటీ ప్రతినిథులు, నవీ ముంబై పోలీసుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


ఈ మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికుల్లో దాదాపు 100 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ మార్కెట్‌‌ను మూసివేయాలని నిర్ణయించారు. తిరిగి ఈ నెల 18 నుంచి పునఃప్రారంభమవుతుంది. 


కూరగాయలు, పప్పు ధాన్యాలు, మసాలా దినుసుల బజార్లను సోమవారం నుంచి తెరుస్తారని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి పండ్లు, ఉల్లిపాయలు, బంగాళ దుంపల బజారును తెరుస్తారని తెలిపారు. 


ఈ మార్కెట్‌లోకి వచ్చేవారికి ముందుగా థర్మల్ స్క్రీనింగ్ జరుపుతామని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్‌ను కూడా పరీక్షిస్తామని, ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే మార్కెట్‌లోకి అనుమతిస్తామని తెలిపారు.


Updated Date - 2020-05-17T21:59:04+05:30 IST