ఎమ్మెల్యేల మనస్తాపం సహజమే: గెహ్లాట్
ABN , First Publish Date - 2020-08-12T21:06:44+05:30 IST
కాంగ్రెస్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం సద్దుమణిగిన నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ..

జైపూర్: కాంగ్రెస్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం సద్దుమణిగిన నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఎమ్మెల్యేలు మనస్తాపం చెందడం సహజమేమని, ఏవైనా సమస్యలు ఉండే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సంయమనంతో వ్యవహరించాలని తాను వారికి సూచించినట్టు తెలిపారు.
'కలిసికట్టుగా అంతా పనిచేయాల్సి ఉంటుంది. దూరంగా వెళ్లిన మా మిత్రులు ఇప్పుడు తిరిగి వచ్చారు. అన్ని విభేదాలు విస్మరించి, రాష్ట్రానికి సేవలందించేందుకు అంతా పునరంకితం కావాలి' అని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.
రాహుల్ గాంధీని అసమ్మతి నేత సచిన్ పైలట్ గత సోమవారం కలుసుకోవడంతో రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసమ్మతి ఎమ్మెల్యేల సమస్యలను తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. గత ఆదివారంనాడు గెహ్లాట్ సైతం ఎమ్మెల్యేలందరకూ ఒక లేఖ రాస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రజా వాణిని గుర్తెరగాలని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా సత్యానికి వెన్నుదన్నుగా నిలబడాలని కోరారు.