మే 3 వరకూ..

ABN , First Publish Date - 2020-04-15T08:18:24+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి రోజు రోజుకూ పెరుగుతుండడంతో మే 3దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు, నిపుణుల నుంచి వచ్చిన సూచనలను...

మే 3 వరకూ..

 • మరో 19 రోజులు లాక్‌డౌన్‌


‘వచ్చే వారంరోజులూ మనకి అగ్నిపరీక్ష.  వైరస్‌ వ్యాప్తి నిరోధాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్రతీ ఏరియానూ క్లియర్‌ చేసుకుంటూ పోవాలి. వైర్‌స రహితం నుకున్నప్పుడే అత్యవసర సేవలకు అనుమతివ్వడం జరుగుతుంది. దీనిపై 20న సమీక్షిస్తాం’ 

-ప్రధాని మోదీ


 • ద్విముఖ వ్యూహం ఆవిష్కరించిన మోదీ
 • వైర్‌స రహితం చేస్తే 20 తర్వాత సడలింపు
 • నిబంధనలను ఉల్లంఘిస్తే మళ్లీ ఆంక్షలు 
 • వచ్చే 3 నెలలూ చాలా జాగ్రత్త అవసరం
 • లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు నేడు విడుదల


ప్రజలకు సప్తపది

 1. ఇళ్లలోని వృద్ధులు.. ప్రత్యేకించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వ్యాధులున్న వారికి అదనపు సంరక్షణ ఇవ్వండి
 2. దిగ్బంధం అనే లక్ష్మణ రేఖను కచ్చితంగా పాటించండి. ఇళ్లలో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించండి.
 3. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించండి. వేడినీళ్లు, కషాయం వంటివి తరచూ తాగండి. 
 4. వైరస్‌ వ్యాప్తి నిరోధం కోసం ఆరోగ్య సేతు మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతోపాటు ఇతరులను కూడా అందుకు ప్రోత్సహించండి. 
 5. మీ చుట్టూ ఉన్న పేదల యోగక్షేమాలను పట్టించుకోండి. వారి అవసరాలను తీర్చేందుకు ప్రయత్నించండి. 
 6. మీ వ్యాపారాలు, పరిశ్రమల్లో పనిచేసే వారిపై కరుణతో వ్యవహరించండి. వారిలో ఎవరికీ జీవనోపాధి లేకుండా చేయవద్దు. ఉద్యోగాల నుంచి తీయొద్దు.
 7. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది వంటి మన జాతీయ యోధుల పట్ల అత్యంత గౌరవాన్ని చూపండి. 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి రోజు రోజుకూ పెరుగుతుండడంతో మే 3దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు, నిపుణుల నుంచి వచ్చిన సూచనలను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడిగిస్తున్నామని ఆయన మంగళవారం నాడు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. గత నాలుగు వారాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించడం ఇది మూడోసారి. ఈ పొడిగింపు ప్రకటన చేస్తూనే ఆయన ఆంక్షల సడలింపుపై ఓ కీలక వ్యాఖ్య చేశారు. ఏప్రిల్‌ 20 తరువాత ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తామంటూనే షరతు పెట్టారు. ‘వచ్చే వారంరోజులూ మనకి అగ్నిపరీక్ష. ప్రతీ ఏరియానూ క్లియర్‌ చేసుకుంటూ పోవాలి. వైర్‌స-రహితం అనుకున్నప్పుడే అత్యవసర సేవలకు అనుమతిస్తాం. దీనిపై 20న సమీక్షిస్తాం’ అన్నారు.


మే 3 దాకా ఎందుకు..?

లాక్‌డౌన్‌ను ప్రఽధాని 14 లేదా 21 రోజులు పొడిగించలేదు. 19 రోజులు అన్నారు. ఎందు కు? అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఏప్రిల్‌ 30దాకా లాక్‌డౌన్‌ను పొడిగించాయి. మళ్లీ అదే తేదీని ప్రఽధాని చెప్పదలుచుకోలేదు. ఏప్రిల్‌ 30 తర్వాత వరుసగా వచ్చే 3 రోజుల సెలవుల్లో ప్రజలు రోడ్లపైక మూకుమ్మడిగా వస్తే మళ్లీ ఇబ్బందులు తప్పవని ఆయన భావించారు. ఒకటిన మేడే, 2న శనివారం అనేక ప్రైవేటు సంస్థలకు సెలవు. ఆదివా రం ఎటూ సెలవే. అందుకే 3ను ఎత్తివేతకు తగిన తేదీగా మోదీ ఎన్నుకున్నట్లు ప్రభుత్వ వర్గా లు తెలిపాయి. లాక్‌డౌన్‌లో కొత్త మార్గదర్శక సూత్రాలు ప్రభుత్వం బుధవారం విడుదల చేస్తుందన్నారు. రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి అర్పించే నివాళి ఇదేన ని చెప్పారు. వైశాఖి, పొయిలా, పుత్తాండు, విషు వంటి పండుగలను ఇళ్లలోనే నిరాడంబరంగా జరుపుకోవడం ప్రశంసనీయమన్నారు. 


ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో నయం...

ఇతర దేశాలతో పోలిస్తే కరోనాపై భారత్‌ పోరాటం విజయవంతమైందని, ఈ కృషిలో ప్రజలంతా భాగస్వాములేనని మోదీ అన్నారు. ‘‘ఇక్కడ కరోనా బాధితుల సంఖ్య 100కు చేరక ముందే విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల నిర్బంధ పర్యవేక్షణను తప్పనిసరి చేశాం. అనేక ప్రాంతాల్లో మాల్స్‌, క్లబ్బులు, వ్యాయామ శాలలు మూసేశాం. కేసుల సంఖ్య 550కి చేరే సరికి 21 రోజుల దేశవ్యాప్త దిగ్బంధంపై కీలక నిర్ణయం తీసుకున్నాం. శక్తిమంతమైన దేశాల్లో వైరస్‌ వ్యాప్తి చూస్తే భారత్‌ చాలా మెరుగ్గా ఉంది’’ అని మోదీ చెప్పుకొచ్చారు. 


ఆర్థికంగా భారీ మూల్యమే.. కానీ..

ఆర్థికస్థితి రీత్యా ఈ వైరస్‌ వల్ల భారత్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రధాని అన్నారు. అయితే పౌరుల ప్రాణాల విలువతో బేరీజు వేస్తే ఆర్థిక నష్టం స్వల్పంగా అనిపిస్తుందన్నా రు. పరిమిత వనరులున్న మన దేశం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రపంచమంతా చర్చనీయాంశమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతగా వ్యవహరించాయన్నారు. 


కొత్త కేసు  నమోదు కావద్దు

ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తీరు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను, ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోందని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని మోదీ అన్నారు. భారత్‌లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒక్క మరణం సంభవించినా అది మనకు విషాదమేనన్న స్పృహ పెరగాలి. వచ్చే 3 నెల లూ నిబంధనలు కచ్చితంగా పాటించాలి’’ అన్నారు. 

‘‘కరోనాపై పోరులో కఠిన నిబద్ధతను ఏప్రిల్‌ 20 వరకూ తీవ్రం చేయాలి. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి పట్టణం, ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధి లో దిగ్బంధనాన్ని పటిష్టంగా అమలు చేయాలి. దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. తీవ్ర ముప్పునకు చేరువయ్యే అవకాశం లేదని భావిస్తే ఆ ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 నుంచి షరతులతో కొన్ని అనుమతులిస్తాం. నిబంధనలను అతిక్రమిస్తే అనుమతులన్నీ తక్షణం రద్దవుతాయి’’ అని ఆయన హెచ్చరించారు. 


పేద కూలీలు నా కుటుంబ సభ్యులు

నిరుపేద సోదరీ సోదరుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి పరిమిత అనుమతులు ఇస్తామని ఆయన చెప్పారు. ‘దినసరి ఆదాయం లేనిదే పూటగడవని రోజు కూలీలు నా కుటుంబ సభ్యులు. వారి జీవితాల్లో కష్టాలు లేకుండా చూడడమే నా ప్రాధాన్యత’ అని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన క్రింద సాధ్యమైనంత సహాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రబీ పంటల నూర్పిళ్లు సాగుతున్న రీత్యా రైతుల సమస్యలను కనీస స్థాయికి తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు.


దేనికీ ఢోకా లేదు...

ఆహారం, రేషన్‌, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఢోకా లేదని మోదీ, అమిత్‌షా హామీ ఇచ్చారు. దేశంలో మందులకు కొరత లేదని, ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడంలో భారత్‌ వేగంగా పురోగమిస్తోందని ప్రధాని చెప్పారు. జనవరిలో దేశంలో కరోనా వైరస్‌ పరీక్ష ప్రయోగశాల ఒక్కటే ఉంటే.. ప్రస్తుతం 220కిపైగా ల్యాబరేటరీలు అదే పనిలో నిమగ్నమై ఉన్నాయని చెప్పారు. ప్రతి 10 వేల మం దికీ 1500-1600 పడకలు అవసరమని ప్రపంచానుభవం చెబుతుండగా, మన దేశంలో లక్ష పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 


ముఖానికి మణిపురి మఫ్లర్‌తో మోదీ!

ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతాలో తన ప్రొఫైల్‌ చిత్రాన్ని మార్చేశారు! మంగళవారం ఉదయం ఆయన ప్రసంగం ప్రారంభానికి ముందు నోటికి అది మణిపురి సంప్రదాయ మఫ్లర్‌ కట్టుకొని కనిపించారు. ‘లెంగ్యాన్‌ ఫీ’గా పిలిచే కండువా లాంటి ఆ మఫ్లర్‌ను కట్టుకొని నమస్కారం చేసి ప్రసంగాన్ని ప్రారంభించారు. మోదీ మఫ్లర్‌ కట్టుకోవడం ద్వారా ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న సందేశం ఇచ్చారు. ఆయన ట్విటర్‌ ఖాతాలో ప్రొఫైల్‌ చిత్రంలోనూ ముఖానికి మఫ్లర్‌ను కట్టుకున్న ఫొటో పెట్టారు.

Updated Date - 2020-04-15T08:18:24+05:30 IST