దేశ వ్యాప్తంగా 17 వేల కేసులు.. 418 మృతులు

ABN , First Publish Date - 2020-06-26T07:12:45+05:30 IST

అటు దేశ రాజధాని ఢిల్లీ.. ఇటు ఆర్థిక రాజధాని ముంబై కరోనాతో కకావికలం అవుతున్నాయి. ఢిల్లీలో కేసుల సంఖ్య, ముంబైలో మరణాల తీరు కలవరపెడుతోంది...

దేశ వ్యాప్తంగా 17 వేల కేసులు.. 418 మృతులు

  • వరుసగా ఆరో రోజూ 14 వేలపైగా
  • కరోనాతో మరో 418 మంది మృతి

న్యూఢిల్లీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అటు దేశ రాజధాని ఢిల్లీ.. ఇటు ఆర్థిక రాజధాని ముంబై కరోనాతో కకావికలం అవుతున్నాయి. ఢిల్లీలో కేసుల సంఖ్య, ముంబైలో మరణాల తీరు కలవరపెడుతోంది. మరోవైపు గురువారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 16,922 మంది కరోనా బారినపడినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. 418 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇందులో మహారాష్ట్ర మరణాలే 208 ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 3,890 కేసులు నిర్ధారణ అయ్యాయి. ముంబైలోనే 1,118 మందికి పాజిటివ్‌గా తేలగా, 120 మంది మరణించారు. 80 శాతం మరణాలు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోనే నమోదవుతున్నాయి. కాగా, దేశంలో వరుసగా ఆరో రోజూ 14 వేల కేసులు వచ్చాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 92,573 మంది వైర్‌సకు గురయ్యారు. కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 57.43కు చేరింది. దేశంలో ఒక్క రోజులో 2.07 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.


రాత్రి వరకు అందిన సమాచారం మేరకు దేశంలో మృతుల సంఖ్య 15 వేలు దాటింది. కాగా, ఢిల్లీలో కొత్తగా 3,788 మందికి వైరస్‌ సోకింది. 64 మంది చనిపోయారు. తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో కొత్తగా 442 కేసులు వెలుగుచూశాయి. ఒక్క బెంగళూరులోనే కొత్తగా 113 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 10,560కి చేరింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పటిష్ఠ చర్యలపై సీఎం యడియూరప్ప గురువారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అఖిలపక్ష నేతలతో శుక్రవారం బెంగళూరులో భేటీ కానున్నారు. తమిళనాడులో కేసుల సంఖ్య 70 వేలు దాటింది. గురువారం నిర్వహించిన పరీక్షలలో 3,509 మందికి లక్షణాలు బయటపడ్డాయి. గురువారం 45 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 911కు చేరింది. చెన్నైలో కొత్తగా 1,834 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 47,650కు చేరింది. కరోనా సోకిందన్న భయంతో తిరునల్వేలి హల్వా దుకాణ యజమాని హరిసింగ్‌(75) ఆస్పత్రిలోనే ఉరివేసుకున్నారు. 


Updated Date - 2020-06-26T07:12:45+05:30 IST