జాతీయవాదమే భారతీయ ఆత్మ: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-07-29T01:47:48+05:30 IST

భారతీయుల ఆత్మలో జాతీయవాదం బలంగా ఉందని చెప్పేందుకు ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయని

జాతీయవాదమే భారతీయ ఆత్మ: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారతీయుల ఆత్మలో జాతీయవాదం బలంగా ఉందని చెప్పేందుకు ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి  జైపాల్ రెడ్డి రాసిన ‘ది టెన్ ఐడియాలజీస్’ పుస్తక తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత సాంస్కృతిక ఐక్యతే నేడు దేశప్రజలను సమైక్యంగా మార్చిందన్నారు. మన దేశం, మన నేల, మన జాతి, మన సంస్కృతి, సంప్రదాయాలకు ముప్పువాటిల్లుతుందని గ్రహిస్తే దానిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఏకమవుతారని, ఇదే జాతీయవాదమని అన్నారు. 


మతం, జాతి, భాష వంటి వాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైనది కాదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. అవి మన అస్తిత్వానికి, సంస్కృతికి, సమైక్యతకు, సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడడం ఆరోగ్యకరమైన పరిణామమేనని అన్నారు. ప్రజాస్వామ్యమనేది సామాజిక వ్యవస్థ పరిణామంలో పరిపక్వమైన పరిస్థితులకు సంకేతమన్నారు.  ప్రజాస్వామిక వ్యవస్థల్లో లోపాలు ఉన్నప్పటికీ, ఇవి పరిణామ క్రమంలో ఏర్పడినవేనని స్పష్టం చేశారు. వాటి గురించి చర్చిస్తూ పరిష్కరించుకునే క్రమంలో ప్రజాస్వామ్యం తనను తాను మెరుగుపడి అభివృద్ధి చెందుతూ ఉంటుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 


విద్యార్థిగా ఉన్నప్పటినుంచే విస్తృత అధ్యయనంతో జైపాల్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారని కొనియాడారు. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకారణ సంబంధాలతో, లాజికల్‌గా ఆలోచించడం ఆయన ప్రత్యేకతని ప్రశంసించారు. వాదనా పటిమ, లోతైన విశ్లేషణతో అరుదైన రాజనీతిజ్ఞుడిగా అందరి మనసులు గెలిచిన జైపాల్‌రెడ్డి తన ఆలోచనలకు ‘టెన్ ఐడియాలజీస్’ పేరుతో పుస్తకరూపంలో తీసుకొచ్చారన్నారు. ఈ ఇంగ్లిష్ పుస్తకాన్ని స్వయంగా ఆయనే తనను కలిసి బహూకరించారని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు.  


‘ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని జైపాల్ రెడ్డి వివరించారు. భావజాలాల గురించి విశ్లేషించేటప్పుడు ఆయన ప్రపంచంలో చర్చకు వచ్చిన అన్ని సిద్ధాంతాల గురించి ప్రస్తావించడమే కాకుండా, సమాజంలో మార్పులకు దోహదం చేసిన అనేక పరిణామాలను వాస్తవిక దృక్పథంతో విశ్లేషించి వాటికి తాత్విక కోణాన్ని జోడించారు. ‘వ్యావసాయిక సమాజం నుంచి పారిశ్రామిక సమాజం వరకు’ మారే క్రమంలో వివిధ దేశాల్లో  జరిగిన అనేక పరిణామాలను, అన్వేషణలను, ఆవిష్కారాలను, భావజాలాలను అన్వేషించారు. నేడు మనం చూస్తున్న ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాలతో పాటు పర్యావరణ వాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ, సంస్కరణల వెనుక ఉన్న మూలాల్ని ఆయన పది భావజాలాలుగా వర్గీకరించారు. ఈ పది భావజాలాల్లో ప్రధానమైనది జాతీయవాదం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.


రాజకీయాల్లో ఉన్న వారికి తాత్విక దృక్పథం తప్పని సరిగా ఉండాలని, సిద్ధాంతం, తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృథా అని వెంకయ్య అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని అందిస్తాయన్నారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు దేశానికి బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పరిచేందుకు దీర్ఘకాలిక దృష్టిని, కార్యాచరణను అందించేదే ఒక సైద్ధాంతిక దృక్పథమన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరంను, పుస్తక ప్రచురణ కర్తలు ‘ఓరియంట్ బ్లాక్ స్వాన్’ సంస్థను వెంకయ్యనాయుడు అభినందించారు.

Updated Date - 2020-07-29T01:47:48+05:30 IST