ఢిల్లీ అభివృద్ధి మండలిని నిలదీసిన ఎన్‌జీటీ

ABN , First Publish Date - 2020-07-09T01:42:48+05:30 IST

ఢిల్లీ అభివృద్ధి మండలి (డీడీఏ)ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) గట్టిగా

ఢిల్లీ అభివృద్ధి మండలిని నిలదీసిన ఎన్‌జీటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ అభివృద్ధి మండలి (డీడీఏ)ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) గట్టిగా నిలదీసింది. యమునా నది ప్రక్షాళనలో తన కర్తవ్యాన్ని నిర్వహించకుండా, కుంటి సాకులు చెప్తోందని విమర్శించింది. 


యమునా నదిని పునరుద్ధరించడం చాలా ముఖ్యమైన విషయమని ఎన్‌జీటీ పేర్కొంది. చట్టబద్ధమైన బాధ్యత నుంచి డీడీఏ తప్పించుకోజాలదని స్పష్టం చేసింది. యమునా నది దేశ రాజధాని ప్రాంతంలో ఉందని, ఇక్కడ నిపుణులైన అథికారులు అందుబాటులో ఉన్నారని, మరోవైపు నిధులు కూడా అందుబాటులో ఉన్నాయని, అటువంటి పరిస్థితుల్లో యమునా నదిని పునరుద్ధరిస్తే, 351 నదీ పరీవాహక ప్రాంతాలను పునరుద్ధరించడానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంది. 


ఇటువంటి పరిస్థితుల్లో యమునా నది పునరుద్ధరణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేయడానికి కుంటిసాకులు చెప్పడం సరికాదని పేర్కొంది. 


అయితే స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఎన్‌జీటీకి  డీడీఏ తెలిపింది. ఢిల్లీ డెవలప్‌మెంట్ యాక్ట్, 1957 ప్రకారం ప్రత్యేకమైన న్యాయపరమైన సంస్థను ఏర్పాటు చేయడానికి చట్టపరమైన అడ్డంకులు ఉన్నట్లు తెలిపింది. 


దీనిపై ఎన్‌జీటీ స్పందిస్తూ, వరద ప్రభావిత ప్రాంతాలను పరిరక్షిస్తూ, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. 


ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్, 1957 ప్రకారం డీడీఏ ఏర్పాటైందని, దేశ రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయవలసిన చట్టపరమైన బాధ్యత డీడీఏకు ఉందని ఎన్‌జీటీ తెలిపింది. వెంటనే అంతకుముందు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని, కర్తవ్యం నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు వెతకవద్దని తెలిపింది. 


Updated Date - 2020-07-09T01:42:48+05:30 IST