మధ్యప్రదేశ్ సీఎంగా నరేంద్ర తోమర్?

ABN , First Publish Date - 2020-03-23T18:50:19+05:30 IST

మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ తరపున సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానే

మధ్యప్రదేశ్ సీఎంగా నరేంద్ర తోమర్?

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ తరపున సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానే తదుపరి ముఖ్యమంత్రే అని అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్ఠానం ఒక్కసారిగా చక్రం తిప్పింది. శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కాదని, అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర వ్యవసాయ మంత్రి, నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడైన నరేంద్ర సింగ్ తోమర్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు తోమర్ ముఖ్యమంత్రి పదవి రేసులో ముందున్నారు.


ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నరేంద్ర తోమర్ సీఎం పదవికి సరిగ్గా తూగుతారని బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే ఓ నిర్ణయానికి సైతం వచ్చేసింది. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఈయన గతంలో బీజేపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడు కావడం ఈయనకు కలిసొచ్చే అంశం.


ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వీడీ శర్మ కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న నరేంద్ర తోమర్ క్షత్రియ వర్గానికి చెందిన కీలక నేత. అంతేకాకుండా ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉమా భారతి, బాబూలాల్ గౌర్, శివరాజ్ సింగ్... వీరు ముగ్గరూ ఓబీసీ వర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో ఈ వర్గం ఓటర్లే కీలకంగా వ్యవహరిస్తారు. ఇదేదీ కాదని, బీజేపీ అధిష్ఠానం సాహసం చేసి క్షత్రియ వర్గానికి చెందిన తోమర్‌ను తెరపైకి తెచ్చింది. వీడీ శర్మ, తోమర్ ఇద్దరూ అగ్ర కులాలకు చెందినే నేతలే కావడంతో బీజేపీలోని ఇతర వర్గీయుల నుంచి ఇబ్బంది ఏర్పడుతుందేమోనన్న భయం ఓ వర్గంలో ఉన్నప్పటికీ, ప్రస్తుత అవసరాల దృష్ట్యా తోమర్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోంది.


అంతేకాకుండా రాబోయే కొన్ని రోజుల్లో చంబల్, గ్వాలియర్ నియోజకవర్గాల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు కీలకమైన ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వీడీ శర్మతో పాటు తోమర్ కూడా ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ కోణంలో కూడా తోమర్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 


ఇక, 2005 నుంచి 2018 వరకు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని బీజేపీ అధిష్ఠానం తోమర్‌ను తెరపైకి తేవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అత్యంత నిజాయితీ పరుడిగా, అందరి నోళ్లల్లో ‘మామా‘ అని పిలిపించుకుంటూ నిత్యం ప్రజల నోళ్లల్లో నానుతుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు సీఎంగా ఉండడంతో సహజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది కాబట్టే, ఇక్కడ బీజేపీ ఓడిపోయింది. అంతేగానీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ మీద వ్యతిరేకత ఎంతమాత్రం కాదు. అంతటి ఉద్ధండుడ్ని కాదని తోమర్‌ను తెరపైకి తేవడం బీజేపీకి ఏమాత్రం కలిసొస్తుందన్నది ముందు ముందు చూడాల్సిందే. 

Updated Date - 2020-03-23T18:50:19+05:30 IST