చర్చలు జరుగుతుండగా ఇది సరికాదు : కేంద్ర మంత్రి తోమర్

ABN , First Publish Date - 2020-12-11T00:15:49+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై చర్చలు కొనసాగుతున్న

చర్చలు జరుగుతుండగా ఇది సరికాదు : కేంద్ర మంత్రి తోమర్

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై చర్చలు కొనసాగుతున్న దశలో నిరసనలను తీవ్రతరం చేయడం సరికాదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. చర్చల్లో ప్రతిష్టంభన లేదని, చర్చల సమయంలో రైతులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ఏ చట్టమూ పూర్తిగా చెడ్డది కాదన్నారు. తమకు నష్టం కలిగిస్తుందని రైతులు భావించే నిబంధనలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 


నరేంద్ర సింగ్ తోమర్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, చర్చలు జరుగుతుండగా భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలను ప్రకటించడం సరికాదన్నారు. చర్చలు కొనసాగుతున్నాయని, ప్రతిష్టంభన లేదని అన్నారు. చర్చల సందర్భంగా రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చునన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, ఏ చట్టమూ పూర్తిగా చెడ్డది కాదన్నారు. ఈ చట్టాల్లోని ఏ నిబంధనలు తమకు నష్టం కలిగిస్తాయని రైతులు భావిస్తున్నారో, ఆ నిబంధనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 


ప్రభుత్వ ప్రతిపాదనలను నిన్న (బుధవారం) రైతులకు పంపించామని, అయితే రైతులు తమ తదుపరి దశ ఆందోళనను ప్రకటించారని, ఇది సరికాదని అన్నారు. ఈ ఆందోళనలను విరమించుకోవాలని, చర్చలు ప్రారంభించాలని వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రైతులు చలిలో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిశీలించాలని, తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 


కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి ఈ చట్టాలతో సంబంధం లేదన్నారు. ఎంఎస్‌పీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయినప్పటికీ దీనిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 


Updated Date - 2020-12-11T00:15:49+05:30 IST