బంగ్లాకు ప్రాధాన్యమిస్తూనే ఉంటాం : ప్రధాని నరేంద్ర మోదీ

ABN , First Publish Date - 2020-12-17T18:18:25+05:30 IST

బంగ్లా ప్రధాని షేక్ హసీనా, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కరోనా కారణంగా ఈ చర్చలు వర్చువల్ పద్ధతిలో

బంగ్లాకు ప్రాధాన్యమిస్తూనే ఉంటాం : ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : బంగ్లా ప్రధాని షేక్ హసీనా, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కరోనా కారణంగా ఈ చర్చలు వర్చువల్ పద్ధతిలో జరిగాయి. భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్‌కు ప్రాధాన్యమిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. చిల్హాటీ - హల్దీబాడీ రైల్వే లింక్‌ను ఈ సందర్భంగా ప్రారంభించారు. దీనితో పాటు ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కూడా కుదిరాయి. కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య వర్చువల్ గా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయని, అయితే విజయ దివస్ తర్వాత జరుగుతున్న ఈ వర్చువల్ సమావేశానికి అధిక ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ అన్నారు. విజయ దివస్ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఆ టార్చ్ ను దేశమంతా తీసుకెళ్తామన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం దిశగా అడుగులు వేస్తామని, అదే తమ ప్రాధాన్యత అని మోదీ వివరించారు. కరోనా కాలంలో కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని, వ్యాక్సిన్ తయారీలోనూ ఇరు దేశాలు సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకున్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలు బలంగా ఉండాలని ఇరు పక్షాలు కోరుకుంటున్నాయని, భారత్ ఎప్పుడూ బంగ్లా ప్రజలను గౌరవిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 


1971 ని గుర్తు చేసిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా

ద్వైపాక్షిక సమావేశాన్ని పురస్కరించుకొని బంగ్లా ప్రధాని షేక్ హసీనా 1971 నాటి పరిస్థితులను మరోసారి గుర్తు చేసుకున్నారు. 1971 యుద్ధంలో వీర మరణం పొందిన భారత జవాన్లకు ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. యుద్ధ సమయంలో తన కుటుంబం ఎంత కష్టపడిందో ఈ సందర్భంగా ఆమె వివరించారు. కరోనా సమయంలోనూ ఇరు దేశాలు కలిసే పనిచేశాయని, పరస్పర సంబంధాలు కూడా బలపడ్డాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని షేక్ హసీనా అన్నారు. 

Updated Date - 2020-12-17T18:18:25+05:30 IST