రజనీ ఇంటికి క్యూ కట్టిన ముస్లిం మత పెద్దలు

ABN , First Publish Date - 2020-03-02T14:09:53+05:30 IST

సందర్భంగా ముస్లిం మతపెద్దలు రజనీకి సోదాహరణంగా వివరించారు...

రజనీ ఇంటికి క్యూ కట్టిన ముస్లిం మత పెద్దలు

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో తమిళనాడు జమాఅతుల్‌ ఉల్మా సభ మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం ఉదయం చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని రజనీ నివాసగృహానికి ఆ సభ అధ్యక్షుడు ఖాజామొయినుద్దీన్‌ బాగవి నాయకత్వంలో ఏడుగురు ముస్లిం మత గురువులు వెళ్ళి ఆయనను కలుసుకున్నారు. పౌరసత్వ  సవరణ చట్టం వల్ల తమకు కలిగే నష్టాల గురించి ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు రజనీకి సోదాహరణంగా వివరించారు.


అంతేకాకుండా ఆ చట్టం వల్ల కలిగే నష్టాలను గురించి విపులీకరించే తమిళ పుస్తకాన్ని రజనీకి అందజేశారు. ఇటీవల ఢిల్లీలో సీఏఏ  మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య జరిగిన ప్రాణ నష్టంపై స్పందించిన రజనీకాంత్‌ ఆ సంఘటనకు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం వైఫల్యమే ప్రధాన కారణ మని ఆరోపించారు. అప్పటి దాకా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా వివాదాస్పదమైన ప్రకటనలు జారీ చేసిన రజనీ ఉన్నట్టుండి ముస్లింలకు మద్దతుగా, సీఏఏ మద్దతుదారులకు సానుకూలంగా ప్రకటన చేయడం ముస్లిం వర్గాల్లో సంతోషాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రాష్ట్ర హజ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అబూ బక్కర్‌ రజనీతో భేటీ అయ్యారు. సుమారు అర గంట సేపు సమావేశమయ్యారు.


పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ముస్లింలకు మద్దతు ఇవ్వాలని అబూబక్కర్‌ రజనీకి విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం తమిళనాడు జమా అతుల్‌ ఉల్మా సభ మతపెద్దలు పోయెస్‌ గార్డెన్‌కు వెళ్ళి రజనీకాంత్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలను పచ్చటి పట్టు శాలువలతో రజనీ సత్కరించారు. ఆ తర్వాత గంటసేపు రజనీ వారితో సమావేశమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ముస్లింలకు జరిగే నష్టాలను గురించి వారు వివరించగా రజనీ ఓపికగా విన్నారు.

Updated Date - 2020-03-02T14:09:53+05:30 IST